
Former Union Minister KV Thomas: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ తిరుగుబాటు నేత, కేంద్ర మాజీ మంత్రి కెవి థామస్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి గురువారం బహిష్కరించారు. ఈ మేరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె. సుధాకరన్ తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అంగీకారంతోనే థామస్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సుధాకరన్ తెలిపారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల కాంగ్రెస్ 'చింతన్ శివిర్' ప్రారంభం కానున్న నేపథ్యంలో సుధాకరన్ ఈ మేరకు ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొచ్చిలో ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో థామస్ వేదిక పంచుకున్న కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ ఆయనపై ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
పార్టీ రాష్ట్ర నాయకత్వంతో విభేదించిన సీనియర్ ఎఐసిసి సభ్యుడు, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార ఎల్‌డిఎఫ్ అభ్యర్థి జో జోసెఫ్ తరపున ప్రచారం చేస్తానని బుధవారం చెప్పారు. అయితే తాను కాంగ్రెస్‌ను వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
కొచ్చిలో విలేకరుల సమావేశంలో కెవి థామస్‌ను మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ కాంగ్రెస్ వాదినే.. నేను కాంగ్రెస్‌ను విడిచిపెట్టను లేదా మరే ఇతర పార్టీలో చేరను. ఎల్‌డిఎఫ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌వాదిగా కూడా పాల్గొంటాను" అని అన్నారు. గతంలో ఏప్రిల్‌లో జరిగిన సీపీఐ (ఎం) పార్టీ కాంగ్రెస్‌లో భాగంగా పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి నిర్వహించిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు.