
Azaan row: కర్ణాటకలో ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కర్ణాటక సర్కర్ అనవసర రగడ చేయడంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్ చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారక ముందే.. మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులను నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. మరో వివాదం కర్ణాటక రాజకీయాలను హిటెక్కిస్తోంది. తాజాగా, నమాజ్‌కు ముస్లింలను ఆహ్వానించే అజాన్ పై ఆంక్షలు విధించాలని హిందుత్వ పార్టీ లు కోరడం వివాదస్పదంగా మారింది.
అజాన్ వివాదంపై .. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డి దేవెగౌడ స్పందించారు.
ఈ విషయంలో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని అధికార బీజేపీ గనక తుది నిర్ణయం తీసుకుంటే.. కర్నాటకలో ఆ పార్టీ పాలనకు తెరపడినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ బీజేపీ అన్నంత పనీ చేస్తే.. కర్ణాటక రాజకీయాల నుంచి బీజేపీ దూరమైనట్టే.. ఆ పార్టీకి రాష్ట్రంలో అవే చివరి రోజులని హెచ్చరించారు.
ఇక ఇదే అంశంపై కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ కూడా స్పందించారు. అధికార బీజేపీని విమర్శించారు. రాష్ట్రంలో అధికార బీజేపీ ముస్లింలను వేధిస్తున్నారనీ, లౌడ్ స్పీకర్ల ద్వారా తమకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని కొంతమంది కాషాయవాదులు, రైట్ వింగ్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇది శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిందని వారు చెప్పారు.
ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఇతర పోలీసు అధికారులను కూడా కలిశారు. దీని తర్వాత.. బెంగళూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనుమతించదగిన డెసిబెల్ లెవెల్స్‌లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలని పోలీసులు ఆదేశించారు. ఈ ఆదేశాలు.. కేవలం మసీదులపై కాకుండా దేవాలయాలు, చర్చిలు మరియు ఇతర సంస్థలకు తమ లౌడ్ స్పీకర్లను అనుమతించదగిన డెసిబెల్ లెవల్స్‌లో ఉపయోగించాలని నోటీసులు జారీ చేశారు.
మొత్తం 301 నోటీసుల్లో 59 పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లకు, 12 పరిశ్రమలకు, 83 దేవాలయాలకు, 22 చర్చిలకు, 125 మసీదులకు అందజేయబడ్డాయి. దీనిపై సున్నీ ఉలేమా కౌన్సిల్ స్పందిస్తూ.. "హిందూ శక్తులు" దేశాన్ని ద్వేషం వైపు నెట్టివేస్తున్నాయని ఆరోపించింది. కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి హాజీ మహ్మద్ సలీస్ రెండు మూడు నిమిషాల్లో అజాన్ అయిపోతుందని వివరించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు రాజ్ థాకరే వివాదంపై స్పందిస్తూ... మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక వేళ..తొలగించకుంటే.. మసీదుల ముందు లౌడ్ స్పీకర్లను ఉంచి హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరుకుంది. అదే సమయంలోకర్ణాటకలో ఆజాన్ వివాదం పెరిగింది.
ఇదిలావుండగా, కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం లౌడ్ స్పీకర్ విషయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ సమస్యలన్నీ సృష్టిస్తున్నాయని ఆరోపించారు. డెసిబెల్ మీటర్ల హైకోర్టు ఉత్తర్వులు దానిపై కూడా ఆమోదించబడిందని, ఇది అజాన్‌కు మాత్రమే కాదని, అన్ని లౌడ్ స్పీకర్లకు అని ఆయన అన్నారు.
విషయంపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన సమస్యలను ఉపయోగించుకోవాలని పాలక బిజెపి ప్రయత్నిస్తోందనీ, సమాజాన్ని తారుమారు చేస్తోందని, మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్ల వివాదం రాబోయే రాష్ట్ర ఎన్నికలలో బొమ్మై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలుతాయని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా, కర్నాటకలో హిజాబ్‌పై నిరసనలు జరుగుతున్నాయి, కొన్ని రైట్ వింగ్ గ్రూపులు కూడా 'హలాల్' మాంసంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.