
Former Mahindra Group chairman Keshub Mahindra dies: భారతదేశపు అత్యంత వృద్ధ బిలియనీర్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశుబ్ మహీంద్రా(99) కన్నుమూశారు. ఫోర్బ్స్ ప్రకటించిన ధనవంతుల జాబితా ప్రకారం మహీంద్రా నికర విలువ 1.2 బిలియన్ డాలర్లు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి 2012 ఆగస్టు 9న పదవీ విరమణ చేసిన ఆయన తన మేనల్లుడు ఆనంద్ మహీంద్రాకు కంపెనీ పగ్గాలు అప్పగించారు. దాదాపు 48 సంవత్సరాల పాటు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన.. మహీంద్రా గ్రూప్ ఆటోమొబైల్ తయారీదారు నుండి ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపార విభాగాలకు కంపెనీని విస్తరించారు. విల్లీస్ కార్పొరేషన్, మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటిష్ టెలికాం వంటి ప్రపంచ దిగ్గజాలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
కేశుబ్ మహీంద్రా కన్నుమూసిన విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల మాజీ ఎండీ పవన్ కె గోయెంకా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'పారిశ్రామిక ప్రపంచం ఈ రోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. శ్రీ కేశుబ్ మహీంద్రాకు సాటి ఎవరూ లేరు అని ట్వీట్ చేశారు. అలాగే, అయన నుంచి బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ ఇలా అనేక అంశలకు సంబంధించిన విషయాలను తెలుసుని స్ఫూర్తి పొందాననీ, ఆయనకు శాంతి కలగాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
కాగా, కేశుబ్ మహీంద్రా అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించిన ఆయన 1947లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ లో చేరి 1963లో చైర్మన్ అయ్యారు. సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐఎఫ్సి, ఐసిఐసిఐతో సహా ప్రయివేటు, పబ్లిక్ డొమైన్లలోని అనేక బోర్డులు-కౌన్సిల్లలో కూడా ఆయన సేవలందించారు. మహీంద్రా హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) వ్యవస్థాపక చైర్మన్ కూడానూ. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్గా, చైర్మన్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఆయన సేవలందించారు.
వార్టన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశుబ్ మహీంద్రా.. జేఆర్ డి టాటాను తన రోల్ మోడల్ గా చూశానని పేర్కొన్నారు. "నేను నా మార్గదర్శకులలో ఒకరిద్దరి పేర్లను చెప్పాల్సి వస్తే, వ్యాపార ప్రపంచం నుండి [పారిశ్రామికవేత్త] జె.ఆర్.డి.టాటా ఉంటారు. అలాగే, సామాజిక, రాజకీయ ప్రపంచం నుండి [సామాజిక కార్యకర్త] నానాజీ నానాజీ దేశ్‌ముఖ్‌ను ఎంచుకుంటాను. నేను ఆరాధించే వారిలో ఒక సాధారణ అంశం వారి అభిరుచి. అలాగే, వారి జీవితంలో ఏదైనా చేసే అవకాశాలు లేని అభాగ్యులకు మద్దతు అందించడానికి అంకితభావం" అని ఆయన చెప్పారు.