
Former CJI RC Lahoti: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) రమేష్ చంద్ర లాహోటి బుధవారం మరణించారు. బుధవారం సాయంత్రం ఆకస్మత్తుగా.. గుండె పోటు రావడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు అపోలో వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు మాజీ ప్రధాన న్యాయమూర్తి సోదరుడు జికె లహోటి తెలిపారు. అతనికి గుండెపోటు రావడంతో మరణించాడని తెలిపారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో జరుగుతాయని తెలిపారు.
జస్టిస్ లాహోటీ జూన్ 1, 2004న భారతదేశ 35వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన దాదాపు ఏడాదిపైగా పదవీలో సేవలందించి.. నవంబర్ 1, 2005న పదవీ విరమణ చేశారు. జస్టిస్ లాహోటి పదవీ విరమణ చేసినప్పటి నుండి నోయిడాలో నివసిస్తున్నారు, అయితే అప్పుడప్పుడు ఇండోర్‌కు వెళ్లేవారు. ఇండోర్‌లో ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.
నవంబర్ 1, 1940లో జన్మించిన అతను 1960లో గుణ జిల్లాలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత 1962లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. ఈ తరుణంలో 1977లో స్టేట్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్‌కు నియమితులయ్యారు. అనంతరం జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించబడ్డాడు. ఒక సంవత్సరం పాటు పదవిలో పనిచేసిన తరువాత.. జస్టిస్ లోహతి మే 1978లో రాజీనామా చేసి, ప్రధానంగా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
అనంతరం.. 1988 మే 3న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన మరుసటి సంవత్సరం ..1989 ఆగస్టు 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం.. 1994, ఫిబ్రవరి 7న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యాడు. తరువాత డిసెంబర్ 9, 1998 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీని తర్వాత జూన్ 1, 2004న, ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. లాహోటి 31 అక్టోబర్ 2005 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన కేరర్ లో ఎన్నో సంచలనత్మాక తీర్పులను వెలువరించారు.