
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబైకి ఒకే రోజుప్రవేశించాయి. దీంతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానికి ఒకేసారి సారి ఇలా రుతుపవనాలు చేరుకోవడం, వర్షం కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇలాంటి అరుదైన దృగ్విషయం చివరిసారిగా 1961 జూన్ 21న సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రోజు కూడా ఇలాగే ఒక రోజు రెండు నగరాలకు రుతుపవనాలు చేరుకున్నాయని, వర్షం కురిసిందని పేర్కొంది. కాగా.. ఈ రెండు నగరాలు ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఎమర్జెన్సీకి 48 ఏళ్లు.. అవి చీకటి రోజులు, మరచిపోలేని కాలం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..
రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న ఢిల్లీని తాకుతుంటాయి. అయితే ఈ ఏడాది నిర్ణీత సమయం కంటే రెండు రోజులు ముందుగానే చేరుకున్నాయి. మరోవైపు ముంబైకి రుతుపవనాల జూన్ 11న రావాల్సి ఉండగా..రెండు వారాల ఆలస్యంగా ఆదివారం ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
అయితే ఢిల్లీకి గత ఏడాది జూన్ 30న, 2021 జూలై 13న, 2020లో జూన్ 25న, 2019లో జూలై 5న, 2018లో జూన్ 28న రుతుపవనాలు చేరుకున్నాయని ఐఎండీ తెలిపింది. అయితే నేటి (ఆదివారం) ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో దేశ రాజధాని వాసులు ఉలిక్కిపడ్డారు. ఉదయం 5.30 గంటల వరకు నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్జంగ్ లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నైరుతి ఢిల్లీలోని పాలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వానల నేపథ్యంలో ఢిల్లీకి నేడు, రేపు (జూన్ 25, జూన్ 26) ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధ (జూన్ 27), గురువారం (జూన్ 28) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా.. రెండు వారాల ఆలస్యం తర్వాత రుతుపవనాలు ముంబైకి చేరుకున్నాయి. దీని వల్ల ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల నగరంలోని పలు చోట్ల నీరు నిలిచింది. వాతావరణ శాఖ ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని కొలాబా అబ్జర్వేటరీ పేర్కొంది.