
పాట్నా: బిహార్‌లో ఘరానా దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆయుధాలతో ఓ ముఠా నగల షాపులోకి చొరబడింది. విధ్వంసం సృష్టించింది. కస్టమర్లను బెదిరించింది. దోపిడీని అడ్డుకోబోయిన ఓనర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. అద్దాలను పగులగొట్టి నగలను, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ వీడియోను సంకేత్ ఉపాధ్యాయ్ అనే ఓ రిపోర్టర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నది.
హాజిపూర్‌లో జూన్ 22న రాత్రి 8 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. హాజీపూర్‌లోని సుభాష్, మదాయ్ చౌక్‌ల మధ్య ఉండే నీలమ్ జువెల్లరీలోకి ఐదుగురు దొంగలు తుపాకులతో ఎంటర్ అయ్యారు. కస్టమర్లను వేధించారు. వారి దొంగతనానన్ని అడ్డుకోబోయిన షాప్ ఓనర్ సునీల్ ప్రియదర్శిని ఆ దొంగలు తీవ్రంగా కొట్టారు. చేతులతో కొట్టడమే కాకుండా.. కౌంటర్ ఎక్కి మరీ తన్నారు.
అనంతరం, గ్లాస్ కేస్‌లోని నగలను దోచుకెళ్లడానికి వారు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి ప్రియదర్శిని ప్రయత్నించారు. దీంతో ఓ దుండగుడు ఓనర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆ ఓనర్ అక్కడే నేలకొరిగాడు. వారు ఆ గ్లాస్ కేస్‌లను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటనతో ఆ నగరం అంతటా భయాందోళనకర వాతావరణం ఏర్పడింది. జిల్లా ఎస్పీ వెంటనే చర్యలకు ఆదేశించారు. దోపిడీ జరిగిన నగల షాపు చుట్టుపక్కల అదనపు బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదు.