
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. బట్టలు ఉతికేందుకు క్వారీ వద్దకు వెళ్లిన కుటుంబం ఆ నీటిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. 5 గురు సభ్యులు ఆ నీటిలోనే తుదిశ్వాస విడిచారు. బట్టలు ఉతికే సమయంలో ఒకరు కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లి కుటుంబ సభ్యులు కూడా అందులోనే గల్లంతయ్యారు.
ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై డోంబివాలి సమీపంలోని సండాప్ గ్రామంలోని ఓ కుటుంబం నీటితో నిండి ఉన్న క్వారీలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఈ కుటుంబంలో మొత్తం 5గురు సభ్యులు ఉండగా ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ క్వారీ వద్ద బట్టలు ఉతుకుతున్నప్పడు ప్రమాదవశాత్తు ఓ బాలిక నీటిలో జారి పడిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు అందరూ క్వారీలో దూకారు. కానీ అందులో నీళ్లు అధికంగా ఉండటం వల్ల ఐదుగురు మునిగిపోయారు. మృతులను మీరా గైక్వాడ్ (55), ఆమె కోడలు అపేక్ష (30), మనవరాళ్ళు మయూరేష్ (15), మోక్ష (13), నీలేష్ (15)గా గుర్తించారు.
‘‘ క్వారీ సమీపంలో ఓ మహిళ ఆమె కోడలు బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఈ సమయంలో ఆ మహిళ ముగ్గురు మనవరాళ్ళలో ఒకరు నీటిలోకి జారిపోయారు. మిగతా నలుగురు ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించగా వారంతా మునిగిపోయారు ’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. ఈ ఘటనపై డోంబివలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నీటిలో మునిగిన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి ఓ అక్క ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మండలానికి చెందిన నక్క భాస్కరరావు, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరికి కుమార్తె ప్రశాంతి(13), కుమారుడు దినేష్(10) ఉన్నారు. వీరిద్దరూ వంశధార నదిలో స్నానం చేసేందుకు కలిసి వెళ్లారు. నీటిలో దిగి కాసేపు ఆడుకున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో దినేష్ నీటిలో మునిగిపోతుండటాన్ని ప్రశాంతి గమనించింది.
దీంతో తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు అక్క ప్రయత్నించింది. అతి కష్టం మీద ఈదుతూ తమ్ముడిని ఒడ్డుకు చేర్చింది. అయితే ఆ సమయంలో ప్రశాంతి కడుపులోకి నీళ్లు వెళ్లిపోయాయి. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీనిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను హిరమండలం ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆ బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది.