
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఐదుగురు కానిస్టేబుళ్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లంచం తీసుకున్న వారిని నిర్థోషులు ప్రకటించడమేంటని అనుకుంటున్నారా? ఆ కేసు రెండు, మూడేళ్ల క్రితంది కాదు.. దాదాపు 37 ఏళ్ల నాటి కేసు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఒక్క సాక్షిని కూడా హాజరుపరచలేదు.అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా ఈ కేసులో జరుగుతున్న విచారణలో కేసు డైరీని కూడా సమర్పించలేదు. దీంతో ఈ కేసులో నిందుతులుగా ఉన్న ఐదుగురు కానిస్టేబుళ్లను నిర్దోషులుగా విడుదల చేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. పాత విషయాన్ని ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకూడదు. అందుకే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు.
కేసు వివరాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. 1986 జూన్ 10న రాత్రి సమయంలో భాగల్‌పుర్ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద ఐదుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.వారు వచ్చి వెళ్లే వాహనాల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారనే విషయం అప్పటి బెగుసరాయ్ జిల్లా ఎస్పీకి రహస్య సమాచారం అందింది. ఈ మేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఎస్పీ ప్లాన్ వేశారు.ఈ క్రమంలో ఎస్పీ రెండు రూపాయల నోటుపై సంతకం చేసి.. ఓ లారీ డ్రైవర్ కు ఇచ్చారు. పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటును లంచంగా ఇవ్వాలని ఆ లారీ డ్రైవర్ కు చెప్పాడు. అనుకున్న విధంగానే ఆ లారీ డ్రైవర్ ఆ నోటును పోలీసులకు లంచంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీ వెంటనే చెక్‌పోస్ట్ వద్ద వద్దకు వెళ్లి కానిస్టేబుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులు కైలాష్ శర్మ, రామ్ రతన్ శర్మ, రామ్ బాలక్ రాయ్, గియానీ శంకర్ సింగ్,యుగేశ్వర్ మహ్తోలపై కేసు నమోదు చేశారు.
అయితే.. 37 ఏళ్ల నాటి కేసులో ఒక్క సాక్షిని కూడా హాజరుపరచలేదు. ఈ వ్యవహారంపై పదేళ్లపాటు విచారణ సాగింది. విచారణ సందర్భంగా కేసు డైరీని కూడా సమర్పించలేదు. ఈ కేసు అనేకసార్లు విచారణ జరిగి చివరకు భాగల్పుర్ లోని విజిలెన్స్ కోర్టుకు చేరగా తాజాగా వారంతా నిర్ధోషులు అని తీర్పునిచ్చింది. అలా 37ఏళ్లపాటు సాగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు ముగింపు పలికింది.