మియో కమ్యూనిటీ కోసం మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రారంభించనున్న యూసుఫ్ ఖాన్

By Mahesh K  |  First Published Mar 3, 2023, 3:26 PM IST

మియో కమ్యూనిటీ కోసం రాజస్తాన్‌లోని మేవాట్ రీజియన్‌లో యూసుఫ్ ఖాన్ తొలి ప్రైవేట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నారు. మేవాట్‌లో ఎక్కువగా నివసించే మియో కమ్యూనిటీ పిల్లలు విద్యకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది స్కూల్ డ్రాపౌట్లుగానే ఉన్నారు. వారిని ఉన్నత విద్య వైపు తీసుకురావడానికి ఈ యూనివర్సిటీ తోడ్పడుతుందని భావిస్తున్నారు.
 


న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో మియో ముస్లింలు ఎక్కువగా మేవాట్ రీజియన్‌లో ఉంటారు. ఇక్కడ 790 గ్రామాల్లో మియో కమ్యూనిటీకి చెందిన చిన్న పిల్లలు స్కూల్‌ డ్రాపౌట్లుగా ఉంటున్నారు తప్పితే సెకండరీ విద్యను పొందడం లేదు. కానీ, ఈ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రీజియన్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతున్నది.

అల్వార్ జిల్లా చావండి కలాన్ గ్రామంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రీజియన్‌లో మియో ముస్లింల విద్యా ప్రమాణాలను వర్సిటీ పెంచుతుంది. భరత్‌పూర్, అల్వార్ జిల్లాలు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తారంగా ఈ మేవాట్ రీజియన్ వ్యాపించి ఉన్నది.

Latest Videos

మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ యూసుఫ్ ఖాన్ మానసపుత్రికగా ఉన్నది. తిజారా తహశీల్ తాపుకారా గ్రామానికి చెందిన న్యాయవాదే ఈ యూసుఫ్ ఖాన్. డ్రాపౌట్లుగా మిగిలిన ముస్లిం పిల్లలను మళ్లీ పాఠశాలల వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 34 ఏళ్ల యూసుఫ్ ఖాన్ కరోనా లాక్ డౌన్ కాలంలో బాలికలు తమ చదువులను కొనసాగించడానికి కృషి చేశారు. జైపూర్ పోలీసుల సహకారంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో వారిని చేర్పించి చదువు కొనసాగింపజేశారు.

ఈయన ప్రతిపాదించిన ప్రైవేట్ యూనివర్సిటీకి చావండి కాలన్ గ్రామంలో 208 హెక్టార్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ది మిస్సైల్ మ్యాన్స్ విజన్ ఫౌండేషన్ బ్యానర్ కింద యూసుఫ్ ఖాన్ ముస్లింలు, పేద వర్గాల పిల్లల చదువుల కోసం పోరాడుతున్నారు. కొత్త యూనివర్సిటీ ఉన్నత, సాంకేతిక విద్యను వారి దరికి తెస్తుందని ఆ బ్యానర్ అభిప్రాయపడుతున్నది.

దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత బర్కతుల్లా ఖాన్ పేరును వర్సిటీకి పెడుతున్నారు. 1971 నుంచి 73 కాలంలో రాజస్తాన్ సీఎంగా సేవలు అందించిన తొలి ముస్లిం సీఎం ఆయన.

ప్రస్తుతం జరుగుతున్న రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును వర్సిటీ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తన స్వస్థలంలో వెనుకబాటు తనమే ఈ కార్యక్రమానికి తనను పురికొల్పిందని, మే నెలలో ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయని యూసుఫ్ ఖాన్ వివరించారు.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, స్పోర్ట్స్, ఇంజినీరింగ్ సహా పలు మాడ్రన్ సబ్జెక్టులను యూనివర్సిటీ అందించనుంది.

కరోనా మహమ్మారి కాలంలో యూుఫ్ ఖాన్ జైపూర్ పోలీసులతో కలిసి శిక్షా సేతు కార్యక్రమం చేపట్టారు. 17 పోలీసు స్టేషన్‌ల మద్దతుతో పెద్ద సంఖ్యలో బాలికలు తిరిగి వారి చదువు కొనసాగేలా చేశారు. ఈ ప్రాజెక్టు కింద ఆయన వారి ఇళ్లకు వెళ్లి బోధనలు చేశారు. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షలను రాజస్తాన్ రాష్ట్ర ఓపెన్ స్కూల్ ద్వారా రాయించారు. పోలీసులు ఫీజులు చెల్లించి స్టడీ మెటీరియల్‌ను ఆ బాలికలకు పంపిణీ చేశారు. 750 మంది బాలికలు తమ చదువులను ఇప్పుడు కొసాగిస్తున్నారని, పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 

రాజస్తాన్ హైకోర్టులో ఆరేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది యూసుఫ్ ఖాన్ మాట్లాడుతూ మియో ముస్లిం కమ్యూనిటీ కౌమార బాల బాలికలకు విద్య అందించి సాధికారతకు నూతన అధ్యాయం ప్రారంభించవచ్చునని వివరించారు. యూనివర్సిటీ ఏర్పాటుతో పిల్లలు తమ స్కూల్ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసి ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడానికి ప్రోత్సహించినట్టవుతుందని తెలిపారు. అలాగే, ఈ రీజియన్‌లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని వివరించారు.

click me!