
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కొత్తగా ఓ న్యాయపరమైన చిక్కు వచ్చిపడింది. కులం పేరుతో కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వానీలో ఉన్న కొటాలీ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు ఫైల్ చేశారు.
శ్రీరామ్ సేనకు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. తమ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అవమానకరమైన మాటలు వాడారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత చట్టాల ప్రకారం… షెడ్యూల్డ్ కులాలు (SC) లేదా షెడ్యూల్డ్ తెగల (ST)కు చెందిన వారిని కులం పేరుతో వేధించడం లేదా అవమానించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల (అకృత్యాల నిరోధక) చట్టం, 1989 కింద ఈ నేరం రుజువైతే, నిందితులకు కనీసం ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. నేరం తీవ్రతను బట్టి ఈ శిక్షను గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అధికారం కోర్టుకు ఉంటుంది. అంతేకాదు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
ఈ చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(1)(s) కింద ఇలాంటి కుల సంబంధిత కేసులను విచారిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అవమానించే ఉద్దేశంతో, కావాలనే ఎవరైనా కించపరిచే మాటలు వాడితే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. అయితే ఈ సంఘటన కచ్చితంగా బహిరంగ ప్రదేశంలో లేదా నలుగురి ముందు జరిగి ఉండాలనేది చాలా ముఖ్యమైన నిబంధన. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నప్పుడు, ఓ గదిలోపల లేదా వ్యక్తిగతంగా మాట్లాడుకున్న విషయాలకు ఈ చట్టం వర్తించదు.
కేవలం ఒకరి కులం పేరును ప్రస్తావించినంత మాత్రాన అది నేరం కాదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలు జారీ చేశాయి. కోర్టు తీర్పుల ప్రకారం… కులం ఆధారంగా అవమానించాలనే ఉద్దేశం కచ్చితంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో వేధించినట్లు రుజువైతేనే శిక్ష పడుతుంది.
ఒకప్పుడు ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు తీవ్రమైన దోపిడీకి, అణచివేతకు గురయ్యారు. వారికి చట్టపరమైన రక్షణ లేని పరిస్థితి ఉండేది. ఈ వివక్ష, హింస, అవమానాలకు వ్యతిరేకంగా 1989లో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక చట్టం, సామాజిక సమానత్వానికి, ఆత్మగౌరవానికి చట్టపరమైన భద్రత కల్పించింది. ఇప్పుడు ఒకరిని వారి కులం ఆధారంగా తక్కువగా చూడటాన్ని, తిట్టడాన్ని లేదా వేధించడాన్ని చట్టం అస్సలు అనుమతించదు. ఎంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా తన పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇతరులను కించపరచలేరని ఆధునిక న్యాయ వ్యవస్థ స్పష్టం చేస్తోంది.
హల్ద్‌వానీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో రాహుల్ గాంధీ ప్రసంగం నిజంగానే ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా వ్యక్తిని అవమానించే ఉద్దేశంతో ఉందా? లేదా? అని పోలీసులు ముందుగా విచారణ జరుపుతారు. విచారణ అధికారి సాక్షుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆడియో, వీడియో ఆధారాలను పరిశీలిస్తారు. పోలీసుల విచారణలో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలితే, ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత నిందితుడు కోర్టులో తన వాదనలు వినిపించుకోవడానికి, అలాగే ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరడానికి చట్టంలో అవకాశాలు ఉన్నాయి.