
Babulal Kharadi : రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆ రాష్ట్ర మంత్రి బాబూలాల్ ఖరాడీ వింత వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. . అంతే కాదు, వారికి నివసించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిని నిర్మించి ఇస్తారని సలహా ఇచ్చారు.
రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న బాబూలాల్ ఖరాడీ మంగళవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ‘‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర శిబిరం’’ బహిరంగ సభలో పాల్గొని ఈ వింత ప్రకటన చేశారు. ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనేది ప్రధాని మోడీ కల అని అన్నారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరూ ఆకలితో లేదా నెత్తి మీద కప్పు లేకుండా నిద్రపోకూడదన్నది ప్రధాని కల. మీకు చాలా మంది పిల్లలకు జన్మనివ్వండి. ప్రధానమంత్రి మీకు ఇల్లు కట్టిస్తారు.’’ అని అన్నారు. అయితే మంత్రి ఈ ప్రకటన చేయగానే సభకు హాజరైన జనం నవ్వుకోవడంతో అక్కడికక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు ఒకరినొకరు చూసుకున్నారు.
అనంతరం ఖరాడీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోడీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తోందని తెలిపారు. కేంద్రం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించిందని, రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ప్రజలకు రూ.450కే సిలిండర్లను అందజేస్తోందని చెప్పారు. .బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చురుగ్గా అమలు చేస్తోందని నొక్కి చెప్పారు
ఎవరీ ఖరాడీ..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఝడోల్ నుంచి బాబూలాల్ ఖరాడీ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 15వ రాజస్థాన్ అసెంబ్లీలో 2022లో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన ఇటీవలే క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఇద్దరు భార్యలు, 8 మంది పిల్లలు ఉన్నారు, అందులో 4 కుమారులు కాగా.. మిగిలిన నలుగురు కుమర్తెలు. మొత్తం కుటుంబం దయాపూర్‌లోని కొట్రా తహసీల్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని దిగువ తాలా గ్రామంలో నివసిస్తుంది.