కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం: మన్‌కీ బాత్ లో మోడీ

By narsimha lodeFirst Published Apr 26, 2020, 12:53 PM IST
Highlights

కరోనా పోరులో ప్రతి భారతీయుడు సైనికుడేనని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారన్నారు.

న్యూఢిల్లీ: కరోనా పోరులో ప్రతి భారతీయుడు సైనికుడేనని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారన్నారు.

ఆదివారం నాడు ఉదయం ఆయన మన్ కీ బాత్  కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  పేదరికంతో కూడ మనం పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కరోనాపై పోరులో భారత్ తీసుకొంటున్న చర్యలు ప్రపంచ దేశాలకు స్పూర్తిగా నిలిచినట్టుగా ఆయన చెప్పారు.  కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారన్నారు. 

లాక్‌డౌన్ సమయంలో ప్రజల ఆకలిని తీర్చేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పొలాల్లో పనిచేస్తున్న రైతులను ఆయన అభినందించారు. అద్దెలు వదులుకొనేవారు, పెన్షన్లు కూడ వదులుకొనేవారు కూడ లాక్ డౌన్ కాలంలో ఉన్నారని ఆయన  చెప్పారు.

లాక్‌డౌన్ సమయంలో  130 కోట్ల భారతీయులు చేస్తున్న పనులను తాను చేతులెత్తి నమస్కరిస్తున్నట్టుగా చెప్పారు. ఏవియేషన్, రైల్వే శాఖలు కూడ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, మందులను రైల్వే, విమానాయాన సంస్థలు సరఫరా చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కరోనా సంబంధమైన సందేహాలను తీర్చేందుకు గాను ఆన్ లైన్ ఫ్లాట్ ఫారం ఏర్పాటు చేసినట్టుగా ప్రధాని చెప్పారు. covidwarriors.co.in సైట్ లో సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.

కరోనా అంతం తర్వాత కొత్త ఇండియాను చూస్తారని  ఆయన చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణ కోసం ఆర్డినెన్స్ ను తీసుకొస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.కరోనాను తరిమికొట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు, పారిశుద్య సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 'ఉల్లి'తో ఇల్లు చేరుకొన్నాడు

ప్రతి ఒక్కరూ కూడ ముఖానికి మాస్కులను ధరించాలని ఆయన కోరారు. గతంలో మాస్కులను ధరించాల్సిన అవసరం లేకుండేది. కానీ, ప్రస్తుతం మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది మన దైనందిన జీవితంలో భాగంగా మారిందన్నారు. 

అంతేకాదు ఉమ్మివేయడం  కూడ అత్యంత ప్రమాదకరమనే విషయంగా చెప్పారు. ఈ అలవాటును అంతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

పండుగలను జరుపుకొనే పద్దతులను కరోనా మార్చివేసిందన్నారు. ఈస్టర్ ను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకొన్నారని ఆయన గుర్తు చేశారు.


 

click me!