మోదీ పర్యటనలో భద్రతా లోపం: విధుల నిర్వహణలో ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ విఫలం.. సుప్రీం కోర్టు

By Sumanth KanukulaFirst Published Aug 25, 2022, 12:08 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌‌లో పర్యటించిన సందర్భంలో చోటుచేసుకున్న భద్రతా ఉల్లంఘన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను సమర్పించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌‌లో పర్యటించిన సందర్భంలో చోటుచేసుకున్న భద్రతా ఉల్లంఘన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటలో భద్రతా లోపాలపై భారీ రాజకీయ వివాదం చెలరేగింది. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్ర  నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీం కోర్టు చదివింది. 

శాంతిభద్రతల పరిరక్షణలో అప్పటి ఫిరోజ్‌పూర్‌ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ) హర్దీప్ భాన్స్ తన విధులను విఫలమయ్యారని నివేదిక పేర్కొంది. ఆయనుకు తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆ మార్గంలో ప్రవేశిస్తారని 2 గంటల ముందు తెలియజేసినప్పటికీ.. విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాని తెలిపింది. ఇక, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానమంత్రి భద్రతను పటిష్టం చేసేందుకు పరిష్కార చర్యలను కూడా సూచించింది. అయితే జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి పంపుతామని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇక, ప్రధాని నరేంద్ర మోదీ  పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మోదీ కాన్వాయ్‌ బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనీవాలాకు వెళ్తున్న మార్గాన్ని రైతులు నిర్భంధించడంతో ఆయన 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైన చిక్కుకుపోయారు. అనంతరం తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

click me!