
భారత్ లో ఫెడరలిజం ప్రమాదపు అంచులో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా ఆవేదన చెందారు. ఇంగ్లీష్ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ ’కు చిదంబరం ‘సిటిజన్ వర్సెస్ స్టేట్ వర్సెస్ లిబర్టీ’ అనే శీర్షికతో వ్యాసం రాశారు. అందులో కేంద్ర రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వైరం, ఆయా రాష్ట్రాల పోలీసుల తీరును ప్రస్తావించారు.
రాష్ట్ర పోలీసు బలగాలు తమ రాజకీయ నాయకులకు సేవ చేస్తున్నాయని ఆ వ్యాసంలో చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీ, హర్యానా పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులు పోలీసులను ఇలాగే ఉపయోగించుకుంటే భవిష్యత్తు మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
‘‘ ఇది ఏదో ఒక రోజు తప్పకుండా జరుగుతుంది. పంజాబ్, ఢిల్లీ, హర్యానా పోలీసుల ఘర్షణ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. పోలీసులు తమ రాజకీయ నాయకులకు సేవ చేస్తున్నాయి. ఈ చర్యలు ఇప్పటికే ప్రమాదంలో ఉన్న సమాఖ్య స్పూర్తిని మరింత పతనానికి దారి తీస్తాయి. ’’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేసిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారని, తాను అప్పుడు కూడా ఇదే విషయాన్ని హెచ్చరించానని అన్నారు. రాష్ట్ర పోలీసు బలగాలు మరో రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అనుమతి తీసుకోవాని సూచించారు. ఇలా చేయకపోతే ఫెడరలిజం చనిపోయి పాతిపెట్టబడుతుంది అని చిదంబరం హెచ్చరించారు. ‘‘ ప్రతీ రాష్ట్ర పోలీసు దళం స్వయంప్రతిపత్తి మరో రాష్ట్రం సరిహద్దుల్లో ఆగిపోవాలి. ఓ రాష్ట్రంలోని పోలీసులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు వారి అనుమతులు తీసుకోవాలి. లేకపోతే ఫెడరలిజం చనిపోతుంది. సమాధి అవుతుంది. ’’ అని ఆయన అన్నారు.
ఇటీవల ఒక రాష్ట్రంలోని పోలీసులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి అరెస్టులు చేశారు. పంజాబ్ పోలీసులు ఢిల్లీకి వచ్చి బీజేపీ నాయకుడు తజిందర్ బగ్గాను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే అరెస్టుకు ముందుగా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆమె తల్లి ఆరోపించారు. అరెస్టు జరిగిన తరువాత మాత్రమే వారికి చెప్పరని అపవాదు ఉంది. అలాగే గతంలో కూడా పంజాబ్ పోలీసులు మరో ఇద్దరు నాయకులను కూడా ఢిల్లీకి వచ్చి అరెస్టు చేశారు. కాగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మేవానిని అస్సాం పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. తరువాత ఈ విషయంలో ఆ రాష్ట్రంలోని జిల్లా కోర్టు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.