మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట వారిపై ఇలాంటి దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో ఓ సింగర్ పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బీహార్ లో దారుణం జరిగింది. ఓ కార్యక్రమంలో పాట పాడేందుకు పిలిపించి ఆ సింగర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటన పాట్నాలో జరిగింది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
జెహనాబాద్‌కు చెందిన 28 ఏళ్ల యువతి పాట్నాలోని మిథాపూర్‌లో నివసిస్తోంది. ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు పాడుతూ ఉంటుంది. అయితే నిందితులు రామకృష్ణనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జ్యో తిబాబా మార్గ్ ప్రాంతానికి ఆమెను ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో వివాహ వేడుక ఉందని, ఆ కార్యక్రమంలో పాటలు పాడాలని కోరారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లింది.
ఆ సింగర్ అక్కడికి చేరుకున్న తరువాత కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం చూసి కంగారు పడింది. తరువాత ముగ్గురు వ్యక్తులు ఆమెను ఏదో ఒక కారణం చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకొని పక్కగదికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. దీంతో పోలీసులు హుటా హుటినా ఘటన స్థలానికి చేరుకుంది. అక్కడ ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, మూడు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశామని పాట్నా ఎస్ఎస్పీ మానవ్జిత్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. బాధితురాలిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలలో డ్యాన్సర్ పై కూడా ఇలాగే గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ యువతి కాన్పూర్ లో డ్యాన్సర్ గా పని చేస్తూ ఉండేది. అయితే బితూర్ ప్రాంతంలోని ఓ కాంట్రాక్టర్ నుంచి ఫిబ్రవరి 6వ తేదీన ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ఫామ్ హౌస్ లో నిర్వహించే కార్యక్రమంలో డ్యాన్స్ చేయాలని చెప్పాడు. దీనికి ఆమె అంగీకరించి అతడు చెప్పిన అడ్రెస్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే స్టేజీ, ఇతర ఏర్పాట్లు గానీ కనిపించలేదు. ఇదేంటని ఆమె ప్రశ్నించింది. ఫాం ఫౌస్ లోని ఓ గదిలోనే డ్యాన్స్ చేయాలని, డబ్బులు ఇస్తామని ఆమెను ప్రలోభపెట్టారు. దీనికి ఆమె అంగీకరించింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న సమయంలో మత్తుమందులు కలిపిన కూల్ డ్రింక్స్ ను అందించారు. వాటిని తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై కాంట్రాక్టర్ , అతడితో పాటు ఉన్న 10 మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. దీనిని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు బెదిరించారు. దీంతో ఆమె భయపడింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బర్రా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి దీనానాథ్ మిశ్రా తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 328, 376, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 డి కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.