
Sultanpur Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లోని లంబూవా ప్రాంతంలోని మణియార్ పూర్ సమీపంలో సోమవారం నాడు ఒక ట్రక్కు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పై ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందగా, వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో సంత్ లాల్ నిషాద్ (40), అతని భార్య కిస్మతి (35) అక్కడికక్కడే మృతి చెందగా, వారి పిల్లలు అన్ష్ (10), అన్షిక (2) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ట్రక్కు డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్న ఈ జంట సికార్ నుంచి జోధ్ పూర్ లోని ఫలోడీకి వెళ్తుండగా జయల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిద్వానా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కిశోర్ మాలి (30), అతని భార్య కిరణ్ (28) గత రాత్రి గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొనడంతో మరణించారని ఎస్ హెచ్ వో హరీష్ సంఖ్లా తెలిపారు. ఈ ప్రమాదంలో కిరణ్ సోదరుడు కృష్ణకుమార్ (22) తీవ్రంగా గాయపడ్డాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మూడు వాహనాలు ఢీ.. బస్సు డ్రైవరు, కండక్టర్ మృతి
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా మూలనూరు సమీపంలోని సాలకడై వంతెనపై ఆదివారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్ మరణించారు. మృతులను తేని జిల్లా తెక్కంపట్టికి చెందిన డ్రైవర్ పాల్కన్నన్ (45), తేనిలోని అమ్మపట్టికి చెందిన కండక్టర్ జె.మురుగన్ (51)గా గుర్తించారు. బోడి మార్గంలో తిరుపూర్- తేని మధ్య వెళ్తున్న బస్సు రాత్రి 11.15 గంటలకు సాలకడై వంతెనపై అదుపుతప్పింది. ప్రయాణికులను మరో టీఎన్ఎస్టీసీ బస్సులోకి తరలించిన తర్వాత పాల్కన్నన్, మురుగన్ బస్సు ముందు నిలబడ్డారు. రాష్ట్ర రహదారుల శాఖ రికవరీ పెట్రోలింగ్ వాహనం వెంటనే అక్కడికి చేరుకుని బస్సు వెనుక నిలిపింది. రికవరీ వాహనంలోని సిబ్బంది రెడ్ ఫ్లాషింగ్ లైట్లను ఆన్ చేసి రోడ్డుపై ట్రాఫిక్ కోన్లను ఏర్పాటు చేసి ఇతర వాహనదారులను అప్రమత్తం చేశారు. "రాత్రి 11.45 గంటలకు, ఈరోడ్‌లోని సత్యమంగళం నుండి తెన్‌కాసిలోని సెంకోట్టై వైపు వెళుతున్న తమిళనాడు రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు, వెనుక నుండి రికవరీ వాహనాన్ని ఢీకొట్టింది. ఇది ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడున్న డ్రైవర్, కండక్టర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని" ఒక అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.