ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీపై వస్తున్న దంపతులను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు..

By team teluguFirst Published Jan 9, 2023, 8:44 AM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుక నుంచి స్కూటర్ పై తిరిగి వస్తున్న దంపతులను ఓ కారు బలంగా ఢీకొట్టి, ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు మరణించారు. 

ఢిల్లీలోని కంఝవాలాలో యువతిని ఢీకొట్టి, కొన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన మరవకముందే ఇటీవల అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ ఘడ్ లో ఈ తరహా ప్రమాదం ఒకటి చేసుకుంది. ఇందులో దంపతులు మరణించారు. వారిని ఓ కారు ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. దుర్గ్‌ జిల్లాలోని పోలసాయిపరకు చెందిన వ్యాపారి బన్నాలాల్ లేఖానీ (55), అతడి భార్య వందనా లేఖాణి (45) రాజ్‌నంద్‌గావ్‌ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై శనివారం రాత్రి స్కూటర్ పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శివనాథ్‌ నదిపై వంతెన సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. అనంతరం స్కూటీని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. తరువాత ఓ వంతెన ఢీకొట్టి ఆగిపోయింది. ఈక్రమంలో దంపతులు ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు ముందు భాగం కూడా ధ్వంసం అయ్యింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులో ఉన్న వారికి ప్రమాదం జరగలేదు. పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందగానే వారు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆలోపే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. 

స్థానికులు, పోలీసులు కలిసి లేఖానీ దంపతులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆ సమయంలోనే దంపతులు మరణించారని డాక్టర్లు నిర్ధారించారు. అయితే భిలాయ్‌కు చెందిన కారు యజమాని సంజయ్‌సింగ్‌ను విచారణకు పిలిచారని పోలీసులు తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎవరు నడుపుతున్నారు ? అందులో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. 

కాగా.. ఈ నెలలో ఇలాంటి ఘటన జరగడం నాలుగోది. రెండు రోజుల కిందట యూపీలో స్కూల్ స్టూడెంట్ ను కారు ఢీకొట్టి, 15 కిలో మీటర్లు లాక్కెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి నగరం హర్దోయ్‌లో 15 ఏళ్ల కేతన్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే తన సైకిల్ పై శనివారం కూడా కోచింగ్ క్లాస్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ తెల్లటి వ్యాగన్‌ఆర్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడి కాలు కారు వెనకాల భాగంలో చిక్కుకుపోయింది.

అయితే దీనిని కారులో ఉన్న వ్యక్తులు గమనించినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. స్థానికులు కారు ఆపాలని ఎంతగా అరిచినా కూడా వారు వినలేదు. బాలుడిని ఈడ్చుకుంటూనే వెళ్లిపోయారు. దీంతో కేతన్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానికులు సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అలాగే నాలుగు రోజుల కిందట యూపీలోని నోయిడాలో డెలివరీ బాయ్ టూ వీలర్ ను ఢీకొట్టింది. అతడిని కూడా 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. అలాగే జనవరి 1 తెల్లవారుజామున ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో 20 ఏళ్ల అంజలి సింగ్ అనే మహిళ కారుతో సుమారు 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
 

click me!