హర్యానాలో రైతులపై భాష్పవాయు ప్రయోగం.. మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేసిన ఆందోళనకారులు

By telugu teamFirst Published Sep 7, 2021, 7:31 PM IST
Highlights

హర్యానాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కర్నాల్ జిల్లా అధికారులతో చర్చలు విఫలమైన తర్వాత వారు నమస్తే చౌక్ నుంచి మినీ సెక్రెటేరియట్‌కు మార్చ్ చేపట్టారు. బలవంతంగా మినీ సెక్రెటేరియట్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఎట్టకేలకు వారు మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేశారు.

చండీగఢ్: హర్యానాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జిల్లా అధికారులతో 11 మంది రైతు ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో మినీసెక్రెటేరియట్‌వైపు మార్చ్ ప్రారంభించారు. భద్రతా బలగాలు పెట్టిన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లారు. సెక్రెటేరియట్‌లోకి ప్రవేశించకుండా వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఎట్టకేలకు రైతులు కర్నాల్‌లోని మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేశారు.

గతనెల 28న కర్నాల్‌లో రైతుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు అడ్డుకునే క్రమంలో వారిపై లాఠీచార్జ్  చేశారు. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు రైతులు గాయపడ్డారు. అనంతరం లాఠీ చార్జ్ కారణంగా ఓ రైతు మరణించినట్టు సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రైతులపట్ల కటువుగా వ్యవహరించాలని, గీతదాటితే వారి తలలను పగులగొట్టాలని ఆదేశిస్తున్న ఓ జిల్లా అధికారి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల డిమాండ్లతోపాటు ఆ జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నాల్‌లో ప్రదర్శనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

ఈ పిలుపును అందుకుని హర్యానా సహా పొరుగు రాష్ట్రంలో నుంచీ రైతు ఆందోళనకారులు పెద్దఎత్తున కర్నాల్‌‌లోని అనాజ్ మండీకి తరలివచ్చారు. ఈ మహాపంచాయత్‌కు పెద్దఎత్తున రైతులు హాజరవ్వడంతో జిల్లా అధికారులు రైతు ప్రతినిధులను చర్చల కోసం ఆహ్వానించారు. దీంతో రాకేశ్ తికాయత్, బల్బీర్ సింగ్ రాజేవాల్, యోగేంద్ర యాదవ్ సహా 11 మంది ప్రతినిధులు అధికారులతో మూడు దఫాలుగా చర్చలు చేశారు. తమ డిమాండ్లను అధికారులు అంగీకరించలేదని అనంతరం వారు పేర్కొంటూ నమస్తే చౌక్ నుంచి మినీ సెక్రెటేరియట్‌కు మార్చ్‌ను ప్రకటించారు. ఈ మార్చ్‌లో రైతులు శాంతి భద్రతలకు భంగం కలిగించబోరని స్పష్టం చేశారు.

ఈ పిలుపు వెంటనే రైతులు మినీ సెక్రెటేరియట్‌కు మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలో కనీసం ఆరు బారికేడ్లను వారు దాటుకుంటూ వెళ్లారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులూ భాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం వారు మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి కనీసం 40 కంపెనీల బలగాలు కర్నాల్‌లో మోహరించారు. చుట్టుపక్కల జిల్లాల్లోనూ మొబైల్ ఇంటర్నెల్ సేవలను నిలిపేశారు.

click me!