మీకు కోపమొస్తే నన్ను కొట్టండి.. కానీ, దయచేసి..! ఎమ్మెల్యేలకు స్పీకర్ అభ్యర్థనలు

By telugu teamFirst Published Sep 7, 2021, 6:52 PM IST
Highlights

‘మీకు కోపమొస్తే నన్ను కొట్టండి కానీ, దయచేసి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవద్దు’ జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ రబీంద్రనాథ్ మహతో బీజేపీ ఎమ్మెల్యేలను అభ్యర్థించారు. అసెంబ్లీలో నమాజ్ కోసం ప్రత్యేక గదిని కేటాయించడానికి ఎమ్మెల్యేలు ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నారు.

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసంగా మారుతున్నాయి. అసెంబ్లీలో నమాజ్ చేయడానికి ప్రత్యేకంగా నమాజ్ గదిని కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. అసెంబ్లీలో కాషాయ వస్త్రధారణ చేసి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు, ఆంజనేయ దండాకన్ని పఠిస్తూ ఆందోళన చేశారు. నమాజ్ గదిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ఎంప్లాయ్‌మెంట్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు. చర్చ సజావుగా సాగడానికి సహకరించాలని, వారు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాలని అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో పలుసార్లు కోరారు.

కొశ్చన్ అవర్‌లోనూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు. సభాపతిని అగౌరవించడాన్ని ఉపేక్షించబోమని అనంతరం స్పష్టం చేశారు. సభా మర్యాదను కాపాడాలన్నారు. ‘మీకు ఒకవేళ కోపం వస్తే నన్ను కొట్టండి. కానీ, చర్చను అడ్డుకోవద్దు’ అని ఎమ్మెల్యేలను అభ్యర్థించారు. ‘దయచేసి మీ మీ సీట్లలో కూర్చోండి. నేను చాలా బాధపడుతున్నాను. సభాపతిని అగౌరవపరచవద్దు. నిన్న కూడా ఇలాగే వ్యవహరించారు. ఇది 3.5కోట్ల ప్రజల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం’ అని అన్నారు.

‘అది ఉద్వేగపూరిత ప్రకటన. మేం కూడా బాధపడుతున్నాం. అసెంబ్లీలో స్పీకరే సుప్రీం. ఆయన నిష్పక్షపాతంగా లేనప్పుడు మాకూ బాధే కలుగుతుంది’ అని బీజేపీ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ వ్యాఖ్యలకు బదులిచ్చారు.

కనీసం హనుమాన్ చాలీసానైనా గౌరవించాలని, రాజకీయ లబ్దికోసం చాలీసాను వాడుకోవద్దని బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ కోరారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలకు బజరంగ్ భళీ జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని అన్నారు. ఈ రోజు సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ మెట్లపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు.

అసెంబ్లీలోని టీడబ్ల్యూ 348 గదిని నమాజ్ చేయడానికి కేటాయిస్తూ స్పీకర్ మహతో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగైతే, అసెంబ్లీ ప్రాంగణంలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాలని, ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

click me!