చిన్న పొరపాటుతో తెలియని ఖాతాలోకి నగదు జమ.. నిజాయితీగా డబ్బు తిరిగి ఇచ్చేసిన జమీర్‌భాయ్‌, సర్ఫరాజ్‌..

Published : Apr 18, 2023, 10:33 AM ISTUpdated : Apr 18, 2023, 11:50 AM IST
చిన్న పొరపాటుతో తెలియని ఖాతాలోకి నగదు జమ.. నిజాయితీగా డబ్బు తిరిగి ఇచ్చేసిన జమీర్‌భాయ్‌, సర్ఫరాజ్‌..

సారాంశం

ఓ వ్యక్తి యూపీఐ ద్వారా చెల్లింపు జరుపుతున్న సమయంలో తప్పు మొబైల్ నంబర్‌ను టైప్ చేయడంతో డబ్బు మరొకరి ఖాతాలోకి వెళ్లింది. అయితే డబ్బు పొందిన వ్యక్తులు తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంక్ ద్వారా అతడికి పంపించారు. తమది కాని డబ్బును తిరిగి అసలైన యజమానికి పంపించిన వారి నిజాయితీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపేందుకు ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి యూపీఐ ద్వారా చెల్లింపు జరుపుతున్న సమయంలో తప్పు మొబైల్ నంబర్‌ను టైప్ చేయడంతో డబ్బు మరొకరి ఖాతాలోకి వెళ్లింది. ఆ వెంటనే అతడు జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ డబ్బు పొందిన వ్యక్తులు తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంక్ ద్వారా అతడికి పంపించడంతో కథ సుఖాంతమైంది. అయితే తమది కాని డబ్బును తిరిగి అసలైన యజమానికి పంపించిన వారి నిజాయితీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

వివరాలు.. మహారాష్ట్రలోని శ్రీగొండ పట్టణానికి చెందిన రవి బైకర్ అనే వ్యాపారవేత్త డిజిటల్ లావాదేవీ ద్వారా తన పరిచయస్తుడికి రూ.50,000 పంపేందుకు యత్నించారు. అయితే అతను తన ఫోన్‌లో యూపీఐ-లింక్డ్ యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు అనుకోకుండా తప్పు మొబైల్ నంబర్‌ను టైప్ చేయడంతో డబ్బును మరొకరికి వెళ్లింది. రవి బైకర్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 50 వేలు అతనికి  తెలియని వ్యక్తి ఖాతాలో జమ అయ్యాయి. అయితే యూపీఐ ద్వారా చెల్లింపులు జరపడంతో అవతలి వ్యక్తిని గుర్తించడం, డబ్బును వెనక్కి వచ్చేలా చేయడం కష్టమని రవి తొలుత  భావించారు. తన ఖాతా నుంచి డబ్బును పొందిన వ్యక్తి భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చని, అతనిని ట్రాక్ చేయడం సమయం వృధా అవుతుందని అనుకున్నారు. 

తెలియని వ్యక్తి తన డబ్బును తిరిగి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తాడని కూడా భావించారు. అయితే ఒక అద్భుతం జరిగే వరకు కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి పొందాలనే ఆశను రవి కోల్పోయారు. అయితే తన డబ్బును పొందేందుకు రవి ప్రయత్నం మాత్రం ఆపలేదు. డబ్బు పొందిన వ్యక్తి తనను సంప్రదిస్తారా? లేదా? అని చూస్తూనే ఉన్నారు. 

అదే సమయంలో డబ్బు పొందిన వ్యక్తి ఫోన్ నంబర్, బ్యాంకు వివరాల ద్వారా ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు. తన డబ్బు బదిలీ అయింది ఖండాలా తాలూకాలోని కన్హేరి గ్రామానికి చెందిన సర్ఫరాజ్ జమీర్ పటేల్ అనే వ్యక్తి ఖాతాలోకి అని గుర్తించారు. సర్పరాజ్ 11వ తరగతి చదువుతున్నారు. సర్పరాజ్ తండ్రి జమీర్‌భాయ్ ఒక రైతు. అతడు అందరితో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివాసం ఉంటున్నారు. 

ఇక, రవి బైకర్.. సర్ఫరాజ్‌‌ను సంప్రదించి పొరపాటున రూ. 50 వేలు అతని ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. అయితే సర్పరాజ్ రెండు రోజుల క్రితమే తన తండ్రితో కలిసి బ్యాంక్‌లో జాయింట్ ఖాతా తెరిచారు. సర్ఫరాజ్ మైనర్ కావడంతో తండ్రితో కలిసి జాయింట్ ఖాతా తెరవాల్సి వచ్చింది. అయితే అతనికి బ్యాంకు నుంచి లావాదేవీలకు సంబంధించిన సందేశాలను తనిఖీ చేసే అలవాటు లేదు. అయితే రవి నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత.. సర్ఫరాజ్ తన బ్యాంకు ఖాతాలోని లావాదేవీలను తనిఖీ చేశారు. అందులో రూ. 50,000 జమ అయినట్టుగా గుర్తించారు. 

అదే విషయాన్ని రవికి ఫోన్‌లో సర్ఫరాజ్ తెలియజేశారు. ‘‘అవును.. డబ్బు నా ఖాతాలో జమ అయినట్లు కనిపిస్తోంది. అది మీది.. పొరపాటున జరిగిందివ’’ అని సర్ఫరాజ్ చెప్పారు. ‘‘కొత్తగా తెరిచి బ్యాంక్ ఖాతా కావడంతో నా దగ్గర ఏటీఎం కార్డు కూడా లేదు జాయింట్ ఖాతా కావడంతో యూపీఐ ద్వారా పంపడంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటాయి. అయితే మీరు వ్యక్తిగతంగా వస్తే నేను వెంటనే బ్యాంకు నుంచి డబ్బు తీసుకోగలను’’ అని సర్ఫరాజ్ రవికి తెలియజేశారు. 

సర్ఫరాజ్ తన తండ్రి జమీర్‌కు ఈ డబ్బు విషయం గురించి చెప్పారు. అప్పుడు జమీర్‌భాయ్ తన కొడుకుతో.. ఆ మొత్తాన్ని తిరిగి ఇద్దామని చెప్పారు. అయితే డబ్బును దాని నిజమైన యజమానికి తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడానికి బ్యాంక్‌కు వెళ్లమని తన కొడుకుకు సూచించారు. అయితే సర్పరాజ్.. తాను డబ్బు తీసుకోవడానికి రవిని తమ గ్రామానికి రమ్మని చెప్పానని తన తండ్రి జమీర్‌కు చెప్పారు. 

అయితే అప్పుడు జమీర్.. ‘‘అవతలి  వ్యక్తి ఇంత పెద్ద మొత్తం పొరపాటున మరొకరి ఖాతాలో చేరిపోయిందని అప్పటికే ఆందోళన చెంది ఉంటాడు. అతడిని ఇక్కడికి పిలవడానికి బదులు మనం బ్యాంకుకు వెళ్లి ఈ మొత్తాన్ని ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్) ద్వారా అతని ఖాతాకు పంపుదాం. ఇది అతని డబ్బును వెంటనే యాక్సెస్ చేస్తుంది. ఆందోళనలను తగ్గిస్తుంది’’ అని కొడుకు సర్ఫరాజ్‌తో అన్నారు. 

అయితే వారి నిర్ణయం రవికి ఆనందకరమైన ఆశ్చర్యంతో పాటు భారీ ఉపశమనం కలిగించాయి.  అయితే ఇలా చేయడం ద్వారా జమీర్‌భాయ్ తాను గొప్ప పని చేశారని అనుకోరు. దీనిని వారు తమ 'కర్తవ్యం'గా భావిస్తారు. ‘‘హరమ్ కి హల్వా పురీసే, హలాల్ చట్నీ రోటీ బెటర్’’ (అక్రమ డబ్బుతో వండిన హల్వా కంటే సరైన మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో రోటీ-చట్నీ మంచిది) అని వారు నమ్ముతారు. 

ఈ చర్యలు వారి సంస్కార, మతపరమైన దృక్పథం నుంచి వచ్చినవని జమీర్‌భాయ్ చెప్పారు. తన పూర్వీకులు చేసినట్లుగా తాను కూడా ఎప్పుడూ తన పిల్లల పాత్రలో నిజాయితీని నింపానని తెలిపారు. అయితే ఒకసారి సర్పరాజ్ రూ. 200తో మొబైల్ రీచార్జ్ చేయించాడని.. దుకాణదారుడు డబ్బు తిరిగి ఇచ్చే సమయంలో అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చాడని.. అయితే అతడు మాత్రం అదనంగా ఇచ్చిన మొత్తాన్ని తీసుకోకుండా దుకాణదారుడుకి తిరిగి చెల్లించాడని చెప్పారు. 

ఈ ఘటనకు సంబంధించి రవి బైకర్ స్పందిస్తూ.. ‘‘నేను డబ్బు పంపబోతున్న వ్యక్తి మొబైల్ నంబర్‌కు, సర్ఫరాజ్ మొబైల్ నంబర్‌కు మధ్య ఒక అంకె తేడా మాత్రమే ఉంది. అందుకే అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌లో పొరపాటు జరిగింది. అయితే అది గమనించిన వెంటనే సర్ఫరాజ్‌కి ఫోన్ చేశాను. ఎలాంటి మొహమాటం లేకుండా డబ్బులు జమ అయ్యాయని.. తండ్రి ఇంటికి రాగానే తిరిగి ఇచ్చేస్తానని సర్ఫరాజ్ చెప్పాడు.

కొంత కాలం తర్వాత నాకు జమీర్‌భాయ్ నుండి కాల్ వచ్చింది. ఆయన నాకు న్‌ఈఎఫ్‌టీ ద్వారా డబ్బు పంపిస్తానని నాకు తెలియజేశారు. 50,000 మొత్తం నాకు చేరింది. సర్ఫరాజ్, జమీర్‌భాయ్‌ల నిజాయితీ, సహకారాన్ని అతిగా చెప్పలేము. హిందువులు, ముస్లిములు అన్నదమ్ములని.. ఒకరికొకరు సహాయంగా పరిగెత్తడం నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పేందుకు నేను వారిని కలవబోతున్నాను’’ అని చెప్పారు. 

కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడంలో సర్ఫరాజ్, జమీర్‌భాయ్‌ల చిత్తశుద్ధిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా ఖండాలా పోలీస్ డిపార్ట్‌మెంట్ విజయ్ పిసల్, పోలీస్ పాటిల్ ఇమ్రాన్ ముల్లా ఆయనను సత్కరించారు.

-అష్ఫాక్ పటేల్, ఖండాలా

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu