Farm Laws Repeal Bill: 4 నిమిషాల్లోనే లోక్‌సభలో బిల్లుకు ఆమోదం.. భగ్గుమన్న విపక్షాలు

By team teluguFirst Published Nov 29, 2021, 3:19 PM IST
Highlights

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును (Farm Laws Repeal Bill, 2021) కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే లోక్‌సభలో ( Lok Sabha) వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సభలో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందండం అంతా నాలుగు నిమిషాల్లోనే జరిగిపోయింది. 
 

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును (Farm Laws Repeal Bill, 2021) కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభ‌లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌ శీతకాల సమావేశాల (Parliament winter session) తొలి రోజే కేంద్రం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. విపక్షాల ఆందోళన మధ్యనే ఈ బిల్లు ఆమోదింపబడింది. అయితే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సభలో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందండం అంతా నాలుగు నిమిషాల్లోనే జరిగిపోయింది. సోమవారం ఉదయం  Lok Sabha ప్రారంభం కాగానే.. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ నివాళులర్పింది. ఆ తర్వాత రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఫ్లకార్డులతో సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

12 గంటలకు తిరిగి లోక్‌సభ ప్రారంభైమనప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. మధ్యాహ్నం 12.06 గంటలకు లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 12.10 గంటలకు లోక్‌సభ దీనిని ఆమోదించింది.  మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్‌తో పాటుగా ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 2020లో వ్యవసాయ చట్టాల బిల్లను తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలకు చర్చించే అకాశం కల్పించలేదని ఆరోపిస్తున్నాయి. అయితే పలు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బిల్లులపై ప్రధాని నరేంద్ర మోదీ యూ టర్న్‌ తీసుకున్నారని.. ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలా చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని పార్లమెంట్ సమావేశాలకు ముందుక మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నాయి. 

Also read: Farm Laws Repeal Bill: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘లఖింపూర్ ఖేరీ సంఘటన, ఉత్తర్వుల గురించి మాట్లాడేందుకు మేము వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చను డిమాండ్ చేసాము. చర్చ లేకుండానే బిల్లు ఆమోదించబడింది’ అని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. గతంలో ఆరు రద్దు బిల్లులు ఉన్నాయని.. అన్ని సందర్భాల్లో చర్చ జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడటం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. 

‘కేంద్ర ప్రభుత్వం చేసింది తప్పు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, నిరసనల సమయంలో మరణించిన రైతులకు పరిహారం కోసం హామీ ఇచ్చే చట్టం కోసం రైతులు చేస్తున్న డిమాండ్‌లను మేము ప్రస్తావించాలని అనుకున్నాం. కానీ వాళ్లు మాకు అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి చర్చలు అక్కర్లేదని శరద్ పవార్ కుమార్తె, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. 

Also read: Parliament winter session: ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ

ఇదిలా ఉంటే ప్రతిపక్షాల తీరుపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ‘వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఉంది. ప్రతిపక్షాలు కూడా దానికి మొగ్గు చూపాయి. మేము బిల్లును తీసుకువస్తున్నప్పుడు వారు సభకు ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారు.?. వారు ఎందుకు నిరసన తెలిపారు?’ అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదేనని విమర్శించారు. 

click me!