నకిలీ ఐపీఎస్ శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ .. తీహార్ జైలుకు తరలింపు, వెలుగులోకి మరిన్ని మోసాలు

By Siva KodatiFirst Published Dec 3, 2022, 4:18 PM IST
Highlights

నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీలోని సీబీఐ కోర్ట్. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. 
 

నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాసరావుకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీలోని సీబీఐ కోర్ట్. 14 రోజుల పాటు ఆయనను రిమాండ్‌కు పంపింది. విశాఖలోని కిర్లంపూడికి చెందిన శ్రీనివాసరావు.. తాను సీనియర్ ఐపీఎస్‌నని చేసిన మోసాలు అన్నీ కావు. సీబీఐ , ఈడీ కేసులు సెటిల్ చేయిస్తానంటూ పలువురి నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్‌లను అడ్డాగా చేసుకుని శ్రీనివాసరావు సెటిల్మెంట్లు చేసినట్లు తేలింది. ఐదేళ్లుగా ఢిల్లీలోనే మకాం వేశాడు శ్రీనివాసరావు. అలాగే తెలంగాణ, ఆంధ్ర , తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. ఢిల్లీలో వివిధ పనులు చక్కబెట్టి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 

మరోవైపు శ్రీనివాసరావుపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అలాగే సీబీఐ సీనియర్ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ ప్రవేట్ సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తేలింది. సీబీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఢిల్లీలో పార్కింగ్ అనుమతులు ఇప్పిస్తానని డబ్బులు బాగా దండుకున్నాడని తెలుస్తోంది. పనులు చేసేందుకు అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలని చాలా మందిని బురిడీ కొట్టించాడు శ్రీనివాసరావు. ఇకపోతే.. అతనిని కస్టడీకి ఇచ్చేందుకు కోర్ట్ నిరాకరించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. 

ALso Read:నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు:హైద్రాబాద్‌లో నలుగురు వ్యాపారులకు సీబీఐ నోటీసులు

ఇదిలావుండగా... మంత్రి గంగుల కమలాకర్,  ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)‌లు శుక్రవారం సీబీఐ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో గంగుల కమలాకర్, గాయత్రి రవిలు నోటీసులు అందజేసిన సీబీఐ.. ఈ రోజు విచారణకు రావాల్సిందిగా తెలిపింది. ఈ క్రమంలోనే గంగుల కమలాకర్, గాయత్రి రవిలు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక, సీబీఐ అధికారిగా నటించి ప్రజలను మోసం చేశారనే ఆరోపణలపై  విశాఖపట్నంలోని చిన్న వాల్తేర్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తిని న్యూఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో అధికారులు మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాపు సమ్మేళన సమావేశంలో శ్రీనివాస్.. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిలను కలిసినట్టుగా ఉన్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారిద్దరు విచారణకు హాజరయ్యారు. వారి వెంట లాయర్లను కూడా తీసుకుని వెళ్లారు. 

ఇక, బుధవారం మంత్రి గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేశారు. అయితే తనకు వచ్చిన నోటీసులపై కమలాకర్ స్పందిస్తూ.. సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న శ్రీనివాస్  గెట్ టుగెదర్‌లో తనను కలిశారని చెప్పారు. తాను సీబీఐ ఎదుట హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని చెప్పారు.

click me!