Assam floods : అస్సాంలో వరదల బీభ‌త్సం..118కి పెరిగిన మృతుల సంఖ్య‌.. సిల్చార్ సిటీలో ప‌రిస్థితి విష‌మం..

Published : Jun 25, 2022, 10:01 AM IST
Assam floods : అస్సాంలో వరదల బీభ‌త్సం..118కి పెరిగిన మృతుల సంఖ్య‌.. సిల్చార్ సిటీలో ప‌రిస్థితి విష‌మం..

సారాంశం

అస్సాంను వరదలు వదిలిపెట్టడం లేదు. గత నెలలో వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకొని రాష్ట్రం.. తాజా వరదలతో మరింత అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకు ఈ వరదల వల్ల 118 మంది చనిపోయారు. 

అస్సాంలో వ‌ర‌దలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. రోడ్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి. ప్ర‌జ‌ల ఇళ్ల‌ల్లోకి నీళ్లు చేరాయి. దీంతో అనేక మంది రోడ్డున ప‌డ్డారు. గ‌డిచిన 24 గంటల్లో మ‌రో 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 118కి పెరిగింది. సిల్చార్ సిటీలో ప‌రిస్థితి విష‌మంగా మారింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉన్న 45 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భావితం అయ్యారు. కొత్త‌గా సంభ‌వించిన ప‌ది మ‌ర‌ణాల్లో బార్పేట, ధుబ్రి, కరీంగంజ్, ఉదల్గురి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కచార్, మోరిగావ్లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అయితే రాష్ట్రంలోని పలు నదుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ధుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర, నాగావ్లోని కోపిలి నదులు ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

అక్రమంగా అబార్షన్లు చేసి.. పిండాలను బాక్సులో పెట్టి పడేశారు.. విచారణకు ఆదేశాలు...

కచార్ లోని సిల్చార్ నగరం వరుసగా ఐదవ రోజు నీటిలో మునిగి ఉంది. వరద ముంపు మ్యాపింగ్ నిర్వహించడానికి సిల్చార్ లో రెండు డ్రోన్లను మోహరించారు. వరద ప్రభావిత ప్రజలకు సహాయక సామగ్రిని అందించడానికి కూడా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇటానగర్, భువనేశ్వర్ కు చెందిన ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నాగాలాండ్ లోని దిమాపూర్ కు చెందిన భారత ఆర్మీ బృందాన్ని నగరంలో మోహరించారు.

వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సీఆర్ పీఎఫ్ కు చెందిన 10 మంది సిబ్బందిని, అలాగే ఎస్డీఆర్ ఎఫ్ కు చెందిన నలుగురు సిబ్బందిని ప‌డ‌వ‌ల ద్వారా కచార్ జిల్లాకు తరలించారు. బాధితుల స‌హాయార్థం కోసం హెల్ప్ లైన్ నెంబ‌ర్లు 0361-2237219, 9401044617, 1079 (టోల్ ఫ్రీ)లను అస్సాం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఈ వ‌ర‌దల వ‌ల్ల రాష్ట్రంలో అత్య‌ధికంగా బార్బేట జిల్లా ప్ర‌భావితం అయ్యింది. దాదాపు 8.50 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు వీటి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే నాగావ్ జిల్లాలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు వరదల కారణంగా ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 717 సహాయ శిబిరాల్లో దాదాపు 2.50 లక్షల మంది తలదాచుకున్నారు.

అస్సాంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వారు శుక్రవారం రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని అందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధన్యవాదాలు తెలిపారు.

Young woman Cuts Tongue: నాలుక కోసి కాళీ మాత‌కు నైవేద్యంగా పెట్టిన యువతి

అస్సాంలో వరద ప‌రిస్థితిపై ప్ర‌ధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘‘ రాష్ట్రంలో వ‌ర‌ద పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రంతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ‘‘ వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం, NDRF బృందాలు ఉన్నాయి. వారు తరలింపు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రభావితమైన వారికి సహాయం చేస్తున్నారు. తరలింపు ప్రక్రియలో భాగంగా వైమానిక దళం 250 పైగా సోర్టీలను నిర్వహించింది’’ అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu