
చెన్నై : కోత్తగిరిలో 45 రోజులకు ముందు అదృశ్యమైన వివాహేతర జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా కోత్తగిరి సమీపంలోని వెల్లెరి కొల్లంకు చెందిన శరవణన్ (25)కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొన్నూరు సాపంకరై గ్రామానికి చెందిన సుమతి (23)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం బయటకు తెలియడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత 45 రోజులకు ముందు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. బంధువులు వారికోసం గాలించిన ఆచూకీ తెలియరాలేదు
ఈ క్రమంలో ఆదివారం వెళ్లిరి కొల్లం అటవీ ప్రాంతంలో ప్రజలు వెళుతున్న సమయంలో కుళ్ళిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాల వద్ద దొరికిన లెటర్ లో తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆ తర్వాత మృతదేహాలను కోత్తగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మృతదేహాలు శరవణన్, సుమతివిగా నిర్ధారించారు.
దేవేంద్ర ఫడ్నవీస్ భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మహిళ అరెస్టు
ఇలాంటి ఘటనే, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో సెప్టెంబర్ 12న వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ రంగాకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలంలోని మామిడాల ఆర్అండ్ బీ కాలనీకి చెందిన గొట్టి మహేష్ (28)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య కృష్ణవేణి గర్భవతి. కాగా మహేష్ ఆరునెలలుగా మార్కుక్ కు చెందిన పదిరి స్వప్న (19)ను ప్రేమిస్తున్నాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను స్వప్నను పెళ్లి చేసుకుంటానని మహేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ వారు నిరాకరించారు. స్వప్న తల్లిదండ్రులు సైతం ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహేష్ శనివారం తెల్లవారుజామున తమ బంధువు నవీన్ ను తాము ఉరేసుకుంటున్న స్థలం లొకేషన్ను వాట్సాప్ లో పంపించాడు. అడవి మజీద్ శివారులోని అటవీ ప్రాంతంలో వేప చెట్టుకు మహేష్, స్వప్న ఉరివేసుకున్నారు. కాగా, మృతులకు ములుగు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని అన్నారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించామని తెలిపారు.