
గడిచిన ఐదు ఏండ్లలో భారతదేశం నుంచి 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ ఇలా సమాధానమిచ్చారు.
2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22లో 149.07 డాలర్లు, 2022-23లో 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జట్టు ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగి $169.23 మిలియన్లకు పెరిగిందని వెల్లడించారు.
హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, ప్లెక్స్‌కాన్సిల్ (Human Hair and Hair Products Association and Plexconcil)అందించిన సమాచారం ప్రకారం.. ప్రపంచంలోనే హ్యూమన్ హెయిర్ ప్రొడక్ట్స్ కు(ముడి పదార్థం) భారత్ కేంద్రంగా మారిందని అన్నారు. అలాగే భారత్ లో లభించే జుట్టు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదనీ, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు.
జుట్టు ఎగుమతులలో ఈ ఆధిపత్యాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై, ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరు కావడానికి పరిశ్రమతో కలిసి ప్లెక్స్‌కాన్సిల్ చురుకుగా పనిచేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. ఇది కాకుండా.. విగ్‌ల వంటి అధిక-విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడం ప్రారంభించడానికి భారతీయ ఎగుమతిదారులకు శిక్షణను అందించడానికి ప్లెక్స్‌కాన్సిల్ తో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని తెలిపారు.
ఇటీవల ప్లెక్స్‌కాన్సిల్ నిర్వహించిన అతిపెద్ద బ్యూటీ షోలలో ఒకటైన "కాస్మోప్రోఫ్ వరల్డ్‌వైడ్ బోలోగ్నా 2023"లో భారత్ నుంచి 20 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇండియన్ పెవిలియన్‌ను సందర్శించిన కొనుగోలుదారుల నుండి చాలా సానుకూల స్పందన లభించిందని అన్నారు. 2024లో నిర్వహించనున్న ప్రదర్శనలో ప్లెక్స్‌కాన్సిల్ పాల్గొంటుందని తెలిపారు.