అప్రమత్తంగా ఉండాలి.. : ఢిల్లీలో భూప్రకంపనల వేళ నిపుణుల హెచ్చరిక..

By Sumanth Kanukula  |  First Published Nov 4, 2023, 10:00 AM IST

నేపాల్‌లో వాయువ్య ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంనలు చోటుచేసుకున్నాయి. 


నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా నేపాల్‌లో వాయువ్య ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. 128 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంనలు చోటుచేసుకున్నాయి. ఇక, గత నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం చోటుచేసుకోవడం ఇది మూడోసారి.

ఈ క్రమంలోనే గతంలో వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో  పనిచేసిన భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ కీలక సూచనలు జారీ చేశారు. నేపాల్‌లోని సెంట్రల్ బెల్ట్ ‘‘చురుకైన శక్తిని విడుదల చేసే రంగం’’ గుర్తించబడినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవారం నేపాల్ చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించి.. దోటి జిల్లాకు సమీపంలో భూకంప కేంద్రం ఉందని చెప్పారు. 2022 నవంబర్‌లో ఇదే జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించందని.. అప్పుడు ఆరుగురు మరణించారని తెలిపారు. 

Latest Videos

ఈ ఏడాది అక్టోబరు 3న నేపాల్‌లో వరుసగా సంభవించిన భూకంపాల శ్రేణి కూడా అదే ప్రాంతంలో ఉందని అజయ్ పాల్ చెప్పారు. అవి కొద్దిగా పశ్చిమం వైపు ఉన్నప్పటికీ.. నేపాల్ సెంట్రల్ బెల్ట్‌లో ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ఉత్తరాన కదులుతున్నప్పుడు యురేషియన్ ప్లేట్‌తో విభేదిస్తున్నందున హిమాలయ ప్రాంతాన్ని ‘‘ఎప్పుడైనా’’ భారీ భూకంపం తాకుతుందని పలువురు శాస్త్రవేత్తలు ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇక, దాదాపు 40-50 మిలియన్ సంవత్సరాల క్రితం.. ఇండియన్ ప్లేట్ హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదిలి యురేషియన్ ప్లేట్‌ను తాకినప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయని చెబుతారు.

click me!