రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, త్వరలో ఎంపీ పదవికి రాజీనామా : బాబుల్ సుప్రియో సంచలనం

Siva Kodati |  
Published : Jul 31, 2021, 06:56 PM IST
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, త్వరలో ఎంపీ పదవికి రాజీనామా : బాబుల్ సుప్రియో సంచలనం

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీయాశీలక రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీయాశీలక రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు సుప్రియో తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బాబుల్‌ను తొలగించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెల రోజుల్లో ఖాళీ చేస్తానని బాబుల్‌ వెల్లడించారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు.  తాను టీఎంసీ, కాంగ్రెస్‌, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ఆ పార్టీల్లోకి రమ్మని నన్నెవరూ ఆహ్వానించలేదని బాబుల్ సుప్రియో తెలిపారు. తాను ఎప్పటికీ బీజేపీలోనే ఉంటానని తెలిపారు 

వృత్తిరీత్యా గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోడీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్‌సోల్ నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.

అయితే, ఇటీవల బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బాబుల్‌ను కూడా కమలనాథులు బరిలోకి దించారు. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్‌ బిశ్వాస్‌ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో బాబుల్‌పై బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగగా.. 12 మంది మంత్రులకు మోడీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అందులో బాబుల్‌ కూడా వున్నారు. మరోవైపు బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తో ఈయనకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బాబుల్‌ పార్టీ వీడతారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu