కశ్మీర్ కు రాహుల్ టీం: ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం

By Nagaraju penumalaFirst Published Aug 24, 2019, 4:26 PM IST
Highlights

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటించేందుకు అనుమతులు లేవంటూ ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకున్నారు. అయితే పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. 
 

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ లో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు పార్టీలకు చెందిన నేతలు జమ్ముకశ్మీర్ వెళ్లారు. 

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటించేందుకు అనుమతులు లేవంటూ ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకున్నారు. అయితే పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. 

ఇకపోతే జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు రాహుల్ గాంధీతోపాటు 11 పార్టీలకు చెందిన నేతలు శనివారం బయలు దేరారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో క‌శ్మీర్‌లో ఇంకా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్ష పార్టీలు టీఎంసీ, సీపీఐ, ఆర్జేడీ, ఎల్‌జేడీ, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జ‌న‌తాద‌ళ్‌, ఎస్పీ నేత‌లు రాహుల్ వెంట ఉన్నారు.  

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంన‌బీ ఆజాద్‌, సీతారాం ఏచూరి, డి రాజా, మ‌నోజ్ జా, ఆనంద్ శ‌ర్మ‌, మ‌జీద్ మీమ‌న్‌, వేణుగోపాల్‌, తిరుచి శివ‌, శ‌ర‌ద్ యాద‌వ్‌, దినేశ్ త్రివేదిలు రాహుల్ తోపాటు కశ్మీర్ వెళ్లారు. 

ఇకపోతే జమ్ముకశ్మీర్ లో నేటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా విమర్శించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాహుల్ గాంధీ భయపడుతున్నట్లు జమ్ముకశ్మీర్ లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని, ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణం ఉందని సమాధానం ఇచ్చారు. అంతేకాదు రాహుల్ గాంధీకి ప్రత్యేక హెలికాప్టర్ పంపిస్తాను వచ్చి పరిశీలించుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. 

గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానాన్ని స్వీకరిస్తూనే సెటైర్లు వేశారు. తనకు హెలికాప్టర్ అక్కర్లేదని జమ్ముకశ్మీర్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం కల్పిస్తే చాలు అంటూ పంచ్ లు వేశారు.  

click me!