
నీతి ఆయోగ్ నయా సీఈవోగా మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా నియమితులైన పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.సుబ్రమణ్యం.. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. సెప్టెంబర్ 30న పదవీ విరమణ తర్వాత ఆయన రెండేళ్ల కాంట్రాక్ట్‌పై ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా నియమితులయ్యారు.
సోమవారం సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సుబ్రమణ్యం నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల కాలానికి ఆయన నియమితులయ్యారు. సుబ్రమణ్యం అనేక పరిపాలనా పదవులను నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు.
నీతి ఆయోగ్ సీఈవోగా పనిచేస్తున్న అయ్యర్ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేష్ ఖుల్లార్‌ను హర్యానాకు తిరిగి పంపిన తరువాత ఆయన స్థానంలో అయ్యర్‌ను నియమిస్తారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయ్యర్ జూన్ 24, 2022 న నీతి ఆయోగ్ యొక్క CEO గా రెండేళ్లపాటు నియమితులయ్యారు. మరో ఉత్తర్వులో.. రాజేష్ రాయ్ ఐదేళ్లపాటు ప్రభుత్వరంగ ఐటీఐ లిమిటెడ్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రాయ్ ప్రస్తుతం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
ఎవరు సుబ్రమణ్యం ?
సుబ్రమణ్యం ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు మరియు ఇంజనీరింగ్ పట్టా పొందాడు. అతను లండన్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీని కూడా పొందాడు. 2004 నుండి 2006 వరకు ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ప్రైవేట్ కార్యదర్శిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో కొంత సమయం గడిపిన తర్వాత 2012లో తిరిగి పీఎంఓకి వచ్చారు. 2015 వరకు పీఎంవోలో పనిచేశారు. ఆ తర్వాత చత్తీస్‌గఢ్‌కు తిరిగి వచ్చారు.
అతను మొదట ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాడు. తరువాత అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) గా నియమించబడ్డాడు. 2018లో సుబ్రమణ్యం జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన హయాంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. PTI ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి ముందుగా తెలిసిన కొద్దిమంది అధికారులలో సుబ్రమణ్యం కూడా ఉన్నారు. తర్వాత వాణిజ్య కార్యదర్శిగా కూడా ఆయన పని చేశారు.