మాజీ ప్రియుడి నీచపు పని.. ఆపిల్ పై మహిళ దావా .. ఇంతకీ ఏం జరిగిందంటే..?

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 7:23 PM IST
Highlights

ఓ మహిళ తన మాజీ ప్రియుడు ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను ఉపయోగించి తనను వేధిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఆపిల్‌పై దావా వేసింది. ఎయిర్‌ట్యాగ్ సహాయంతో ప్రియుడు ఆమె ఎక్కడికి వెళ్తుందో గుర్తించగలిగాడు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ తనను వేధించేవాడని అందుకే తప్పించుకునే ప్రయత్నం చేశానని బాలిక వ్యాజ్యంలో పేర్కొంది.

టెక్నాలజీ అనేది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. దాని వల్ల ప్రయోజనాలు ఉంటాయో.. దుష్ప్రభావాలు కూడా అలానే ఉంటాయి. టెక్నాలజీ రంగంలో ఆపిల్ ఆవిష్కరణ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ కంపెనీ రూపొందించిన ఉత్పత్తుల్లో ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌(Apple AirTag) ఒకటి. వ్యక్తులు తమ వస్తువులను సులభంగా గుర్తించడానికి దీనిని రూపొందించింది.

అయితే.. ఈ పరికరాన్ని కొంతమంది వ్యక్తులు వారి వస్తువులను ట్రాక్ చేయడానికి కాకుండా.. వారి ఇష్టానూసారంగా ఉపయోగిస్తున్నారు. ఇతర వ్యక్తులకు తెలియకుండా వారి కదలికలను గుర్తించడానికి ఎయిర్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ మాజీ భాగస్వాములను వెంబడించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఇలా ఎయిర్‌ట్యాగ్‌లను దుర్వినియోగం చేయడంపై ఇప్పటికే  అనేక కేసులు నమోదయ్యాయి. కానీ Apple సమస్యను పరిష్కరించలేకపోయింది. తాజా అలాంటి కేసే మరొకటి నమోదైంది. 

ఆపిల్‌పై కేసు

బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కదలికలను తెలుసుకోవడానికి ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌(Apple AirTag)ని ఉపయోగించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ  మహిళ ఆపిల్‌పై దావా వేసింది. తన మాజీ ప్రియుడు తన కారులో ఎయిర్‌ట్యాగ్‌ను అమర్చాడని మహిళ తన దావాలో ఆరోపించింది. ఎయిర్‌ట్యాగ్‌ని ఉపయోగించి తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకునే ప్రయత్నాలు చేశాడనీ, అలా తెలుసుకుని.. తనని చాలా సార్లు వేధింపులకు గురిచేశాడని ఆమె తన వ్యాజ్యంలో పేర్కొంది. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో మహిళ కూడా యాపిల్‌పై కేసు పెట్టింది. తన పిల్లల బ్యాక్‌ప్యాక్‌లో ఎయిర్‌ట్యాగ్‌ని ఉంచడం ద్వారా తన మాజీ భర్త తన కదలికలను ట్రాక్ చేశాడని మహిళ ఆరోపించింది. 

ఇలాంటి అవాంఛిత ట్రాకింగ్‌ను నిలిపివేసేందుకు ఆపిల్ ఫిబ్రవరిలో కొత్త అప్‌డేట్‌లను తీసుకవచ్చింది. తమకు తెలియకుండా ఎయిర్‌ట్యాగ్ తమతో ప్రయాణిస్తున్నట్లయితే.. వినియోగదారులు అప్రమత్తం కావాలని ఆపిల్ తన బ్లాగ్‌లో తెలిపింది.వినియోగదారులు టోన్ సీక్వెన్స్‌ని ఉపయోగించి ఎయిర్‌ట్యాగ్‌ను కనుగొనవచ్చని తెలిపింది. 

Apple AirTag కొత్త అప్‌డేట్‌ల గురించి తన బ్లాగ్‌లో ఇలా పేర్కొంది. వ్యక్తులు తమ వ్యక్తిగత వస్తువులను గుర్తించడంలో సహాయపడటానికి ఎయిర్‌ట్యాగ్ రూపొందించబడింది. వ్యక్తులు లేదా మరొకరి ఆస్తిని ట్రాక్ చేయడానికి దీనిని రూపొందించలేదు. మా పరికరాలు/ ఉత్పత్తుల హానికర వినియోగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అవాంఛిత ట్రాకింగ్ చాలా కాలంగా సామాజిక సమస్యగా మారింది. AirTag రూపకల్పనలో దీనిని  తీవ్ర సమస్యగా పరిగణించాము. అందుకే దీనిని ఫైండ్ మై నెట్‌వర్క్ గోప్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మించాం. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించాం. అవాంఛిత ట్రాకింగ్ గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి మేము మొట్టమొదటి ప్రోయాక్టివ్ సిస్టమ్‌ను ఆవిష్కరించామని పేర్కొంది. 

click me!