ఐదు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సోమవారం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ని సమర్థించారు. భారతీయ జనతా పార్టీ (bjp) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
సోమవారం మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్ అత్యున్నత పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నకు ఖర్గే సమాధానం ఇస్తూ.. “ ఐదు రాష్ట్రాల్లో ఓటమికి సోనియా గాంధీ కుటుంబం మాత్రమే బాధ్యత వహించదని, ప్రతీ రాష్ట్ర నాయకుడు, ఎంపీ బాధ్యత వహిస్తారని మేమంతా సోనియా గాంధీకి చెప్పాము. ’’ అని ఆయన తెలిపారు. తాము ఆమెపైనే తిరిగి విశ్వాసాన్ని ఉంచామని చెప్పారు. రాజీనామా చేసే ప్రశ్నే లేదు అని ఆయన అన్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు చర్చించామని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తాము బీజేపీ, దాని సిద్ధాంతాలతో పోరాడుతామని చెప్పారు. మా సిద్ధాంతాలను ముందుకు తెస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తాము గతం కంటే మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నామని అన్నారు.
ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆదివారం ఆ పార్టీ సీడబ్లూసీ (Congress Working Committee) సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రయోజనాల కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. అయితే ఆమెను సంస్థాగత ఎన్నికల వరకు కొనసాగాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఆదివారం ఏకగ్రీవంగా నిర్ణయించింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఆమె నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచింది, పార్టీని బలోపేతం చేయడానికి, వచ్చే ఎన్నికలకు ముందు రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి తక్షణమే దిద్దుబాటు మార్పులు చేయాలని ఆమెను కోరింది.
కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా (Congress' chief spokesperson Randeep Surjewala) మాట్లాడుతూ.. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు రాహుల్ గాంధీ పార్టీని నడిపించాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున తదుపరి అధ్యక్షుడిని దాని ద్వారానే నిర్ణయిస్తామని అన్నారు.
గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది. 2014లో కేంద్రంలో అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. నేడు చతికిలిపడిపోయింది. ప్రస్తుతం కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిన్న మొన్నటి వరకు పంజాబ్ (punjab) లో అధికారంలో ఉన్నప్పటికీ.. ఆప్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయింది. పంజాబ్ లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అవనితీ ఆరోపణలు, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం కు మధ్యన సఖ్యత లేకపోవడం, అమరీందర్ సింగ్ రాజీనామా వంటి అంశాలు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసేలా చేశాయి.