
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ స్థానానికి,తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు మంగళవారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ రెండు స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన షెడ్యూల్ ను విడుదల చేసింది ఈసీ. ఈ రెండు స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు ఇవాళ్టి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు మార్చి 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్లను మార్చి 31 వ తేదీన స్కృూట్నీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వ తేదీ చివరి తేదీ.
ఈ రెండు స్థానాల ఫలితాలను మే 2వ తేదీన నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఏపీ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.