
శివసేన వివాదంతో మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై జరుగుతున్న రచ్చ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఠాక్రే కూటమి తీవ్రంగా విమర్శిస్తున్నది.
తాజాగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుబట్టారు. బిజెపి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శరద్ పవార్‌పై సీఎం షిండే ఎదురుదాడికి దిగారు. ఎలక్షన్ కమిషన్ మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్వతంత్ర సంస్థ. మా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేశారు.
అంతకు ముందు రోజు శరద్ పవార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర సంస్థను ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదనీ, ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు పరిష్కరించింది. కానీ, ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
మైనారిటీ వర్గ సభ్యులను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ.. “అది (ఎన్నికల సంఘం) అసలు దాన్ని తీసివేసి మరొకరికి రాజకీయ పార్టీని ఇచ్చిన నిర్ణయం. శివసేన పార్టీని బాలా సాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే, ఆయన తర్వాత పార్టీ బాధ్యతలను ఉద్ధవ్ ఠాక్రే చేపడతారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్‌కు ఎవరో ఫిర్యాదు చేశారు. అది తీర్పు ఇచ్చింది. ఈ పార్టీని స్థాపించిన వారిని కాకుండా .. వేరే వారికి శివసేన, దాని గుర్తును కేటాయించిందనీ, ఇది రాజకీయ పార్టీలపై పెద్ద దాడి అని అభివర్ణించారు.
బీజేపీపై విరుచుకుపడిన ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందనీ, ఈసీతో సహా ప్రతి కేంద్ర సంస్థ దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. తాజాగా రాజకీయ పార్టీలకు కూడా ముప్పు విస్తరించిందనీ, ఇది ప్రజాస్వామ్యంపై పెద్ద దాడి, ఇది ఆగదు. ఎందుకంటే దేశాన్ని ఎవరు నడిపించాలో అది నిర్ణయిస్తుందని అన్నరు.
గత వారం.. ఎన్నికల కమిషన్ శివసేన పేరు, చిహ్నమైన 'విల్లు, బాణం'ను ఏకనాథ్ షిండే వర్గానికి కేటాయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తెలిపింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని, షిండే గ్రూపును దొంగలుగా అభివర్ణించారు ఉద్ధవ్ ఠాక్రే .