రక్తం కారుతోంది.. పాత చెప్పులు ఉంటే ఇవ్వండి సార్.. వలస కార్మికుడి వేడుకోలు

By telugu news team  |  First Published May 18, 2020, 12:20 PM IST

కాలి వెంట రక్తం కారుతుంటే... కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోవడంతో అతని బాధ వర్ణణాతీతం. పాత చెప్పులు ఉంటే ఇవ్వండి సర్ అంటూ అతను ప్రాదేయపడటం గమనార్హం. 


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టాలని దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పొట్ట కూటి కోసం సొంత ఊరిని వదిలేసి వేరే రాష్ట్రానికి వస్తే.. అక్కడ పనిలేక.. తినడానికి తిండిలేక నానా అవస్థలు పడ్డారు.

అయితే.. ఆ వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చేందుకు కేంద్రం ముందుకు వచ్చి రైళ్లు ఏర్పాటు చేసింది. అయితే.. ఆ రైళ్లలో వెళ్లడానికి పేర్లు నమోదు చేసుకున్నా కూడా చాలా మందికి పిలుపు రావడం లేదు. దీంతో.. కాలి నడకనే ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. భుజాన మూటలు పెట్టుకొని.. చిన్న చిన్న పిల్లలను వెంట పెట్టుకొని  వాళ్లు కాలి మార్గన ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఈ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా.. తాజాగా మరో వలస కార్మికుడు బాధ వెలుగులోకి వచ్చింది.

Latest Videos

కాలి వెంట రక్తం కారుతుంటే... కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోవడంతో అతని బాధ వర్ణణాతీతం. పాత చెప్పులు ఉంటే ఇవ్వండి సర్ అంటూ అతను ప్రాదేయపడటం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే...తిలోకి కుమార్ అనే వలస కార్మికుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ దేశమంతా లాక్‌డౌన్ విధించడం వల్ల అక్కడే చిక్కుకుపోవడంతో విధిలేక కాలినడకన తన తోటి 1000 మంది వలసకార్మికులతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. 

శ్రామిక్ రైలులో తన పేర్లు నమోదు చేసుకొని వారం రోజులు గడిచినా ఎవరూ పిలవక పోవడంతో తాము కాలినడకన బయలుదేరామని తిలోకి కుమార్ చెప్పారు. 300 కిలోమీటర్ల దూరం నడిచాక తన కాళ్లకు ఉన్న స్లిప్పర్లు అరిగిపోయి తెగిపోయాయని, దీంతో అరికాళ్ల నుంచి రక్తం స్రవిస్తుందని, తినడానికి దాతలు అన్నం పెడుతున్నారని, తనకు పాత చెప్పులుంటే దానంగా ఇవ్వాలని తిలోకి కుమార్ కనిపించినవారినల్లా అభ్యర్థిస్తుండటం కన్నీళ్లు తెప్పిస్తోంది. 

కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో కాళ్లు కాలుతున్నా నడవడం వల్ల అరికాళ్ల నుంచి రక్తం స్రవిస్తుందని తిలోకి కుమార్ ఆవేదనగా చెప్పారు. దారిమధ్యలో నడిచి వస్తున్న తమకు దాతులు అన్నం, నీళ్లు అందిస్తున్నారని, కాని కాళ్లకు చెప్పులు లేవని, పాత చెప్పులైనా ఇవ్వండంటూ  తిలోకి వేడుకుంటున్నారు. కొందరు దాతలు వారికి డబ్బులివ్వబోగా తీసుకునేందుకు నిరాకరిస్తూ, తాము ఈ డబ్బుతో లాక్ డౌన్ సమయంలో చెప్పులు ఎక్కడ కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. 

దీంతో స్పందించిన ఓ సీనియర్ సిటిజన్ లక్నో నగర శివారులో ఓ షాపు నుంచి స్లిప్పర్లు కొని వలసకార్మికులకు అందించారు. లక్నో -ఫైజాబాద్ జాతీయ రహదారిపై నవీన్ తివారీ అనే వ్యాపారి భోజనంతో పాటు స్లిప్పర్లను కొని వారికి పంపిణీ చేశారు.

click me!