ఝార్ఖండ్ లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. 21 రోజుల శిశువు కడుపులో 8 పిండాలు కనిపించాయి. దీంతో వైద్యులు షాక్ అయ్యారు.
ఝార్ఖండ్ : రాంచీలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. 21 రోజుల వయసున్న శిశువు కడుపులో ఏకంగా ఎనిమిది పిండాలు కనిపించాయి. ఇది చూసి సిటీ స్కాన్ తీసిన వైద్యులే నోరెల్లబెట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్ లో వెలుగుచూసింది. రామ్ గఢ్ లో అక్టోబర్ 10న ఓ మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే పాప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు స్కానింగ్ తీశారు. ఇందులో కనిపించింది చూసి పాప కడుపులో కణితి ఉన్నట్లు వైద్యులు భావించారు. అయితే ఆపరేషన్ చేసిన సమయంలో పొట్టలో ఉన్నది కణితి కాదని.. పిండాలని తెలిసి షాక్ అయ్యారు.
ఆపరేషన్ చేసి పాప కడుపులోనుంచి ఎనిమిది పిండాలను బయటకు తీశారు. ఇది చాలా అరుదైన కేసు అని.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఇప్పటిదాకా 200లోపు కేసులే వెలుగుచూశాయని తెలిపారు. ఇక భారత్ లో ఇలాంటి కేసులు కేవలం 10 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు అంటున్నారు. 10 లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
పదేళ్ల బాలికపై ఇద్దరు కజిన్ల సామూహిక అత్యాచారం
ఇదిలా ఉండగా, బీహార్ లో మే 30న ఇలాంటి అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 40 రోజుల పసికందు శరీరంలో పిండం పెరిగింది. బీహార్ మోతిహారి జిల్లాలోని రహ్మానియా మెడికల్ సెంటర్ కు ఓ దంపతులు తమ 40 రోజుల చిన్నారిని తీసుకువచ్చారు. చిన్నారి పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉండి శిశువు సరిగా మూత్రం పోయలేక పోతోందని వైద్యులు గుర్తించారు. దీనికి కారణాన్ని తెలుసుకునేందుకు సిటి స్కాన్ పరీక్షలు జరపగా విషయం బయటపడింది.
స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యుడు తబ్రీజ్ అజీజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారి శరీరంలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ఫీటస్ ఇన్ ఫెటు’ పిలుస్తారని.. శిశువు కడుపులో ఇంకో పిండం పెరగడాన్ని ఇలా అంటారని తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని వివరించారు. విషయం తల్లిదండ్రులకు వివరించి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు వెల్లడించారు. చిన్నారి బాగానే కోలుకుందని, డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.