
Eid al-Adha: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-అధా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిని బక్రీద్ అని కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో ఈద్-అల్-అధా లేదా ఈద్ ఉల్ జుహా ముస్లింలలో ప్రముఖంగా జరుపుకునే త్యాగానికి గుర్తింపు పండుగ. ఇబ్రహీం ప్రవక్త అల్లాహ్ పై ఉన్న బలమైన విశ్వాసంతో చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జరుపుకునే పండుగ ఈద్ ఉల్ అధా (ఈద్ అల్-అధా లేదా బక్రీద్).
దేశవ్యాప్తంగా బక్రీద్ పండగ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదులు, దర్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-అధా శుభాకాంక్షలు అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరారు. ఇది మన సమాజంలో ఐక్యత, సామరస్య స్ఫూర్తిని నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ.. ఈద్ ముబారక్ తెలిపారు.
అలాగే, త్యాగం, విశ్వాసం, క్షమాగుణం వంటి ఉదాత్త విలువలకు ఈద్-ఉల్-అధా పండుగ ప్రతీక అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ''ఈ సంతోషకరమైన సందర్భంలో, సోదర బంధాలను బలోపేతం చేయడానికి, శాంతియుత, సామరస్యపూర్వక-ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి మనమందరం దృఢంగా సంకల్పిద్దాం. ఈద్ ముబారక్'' అని తెలిపారు.
రాహుల్ గాంధీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం అందరికీ శాంతి, సౌభాగ్యం, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రియాంక గాంధీ వాద్రా 'ఈద్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆశీస్సులు, శాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
అంతకుముందు ఢిల్లీలోని వందలాది మంది జామా మసీదులో నమాజ్ చేశారు. ఈద్-ఉల్-అధాను త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు. ముస్లింలకు గణనీయమైన మత-సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ చివరి నెల అయిన ధూల్-హిజ్జా 10 వ రోజున వస్తుంది.