ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు బిబెక్ దేబ్రాయ్ 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దేశ ప్రధానితో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
న్యూడిల్లీ : ప్రముఖ ఆర్థికవేత్త బిబెక్ దేబ్రాయ్ గురువారం కన్నుమూశారు. 69 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధుపడుతూ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే ఆయనకు వైద్యులు చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో దెబ్రాయ్ ప్రాణాలు వదిలారు.
ప్రస్తుతం దేబ్రాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి అధ్యక్షులుగా వున్నారు. దేబ్రాయ్ పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) లో కూడా పనిచేశారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
undefined
యూపీ సీఎం యోగి ట్విట్టర్ వేదికన దెబ్రాయ్ మృతికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేసారు. ''ప్రధాన మంత్రి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్, ప్రముఖ ఆర్థికవేత్త మరణవార్త దిగ్భ్రాంతి గురిచేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. అతడి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ ట్వీట్ చేసారు.
ఆర్థికవేత్త బిబెక్ దేబ్రాయ్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ బిబెక్ దేబ్రాయ్ ఒక గొప్ప విద్వాంసుడు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి వివిధ రంగాలలో నిష్ణాతుడు అని ఆయన సంతాపం తెలియజేశారు. తన రచనల ద్వారా ఆయన భారతదేశం యొక్క మేధో దృశ్యాన్ని చెరగని ముద్ర వేశారు. ప్రజా విధానంలో ఆయన చేసిన కృషితో పాటు, మన పురాతన గ్రంథాలపై పనిచేయడం మరియు వాటిని యువతకు అందుబాటులో ఉంచడం ఆయనకు ఇష్టం.
పద్మశ్రీ అవార్డు గ్రహీత బిబెక్ దేబ్రాయ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ఢిల్లీ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ... బిబెక్ దేబ్రాయ్ గురువారం ఉదయం 7 గంటలకు పేగుల్లో సమస్య తీవ్రం కావడం కారణంగా మరణించారని ప్రకటించారు.
బిబెక్ దేబ్రాయ్ నీతి ఆయోగ్ సభ్యుడిగా కూడా పనిచేశారు. 5 జూన్ 2019 వరకు ఆయన నీతి ఆయోగ్ సభ్యుడిగా ఉన్నారు. విద్యా రంగంలో కూడా ఆయన గణనీయమైన కృషి చేశారు. ఫూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ ఆండ్ ఎకనమిక్స్ (GIPE) వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు. అనేక పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రసిద్ధ వ్యాసాలు రాశారు. కొన్నింటిని సవరించారు. అనేక వార్తాపత్రికలకు సలహాదారుగా, కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు.
దేబ్రాయ్ రామకృష్ణ మిషన్ స్కూల్, నరేంద్రపూర్; ప్రెసిడెన్సీ కాలేజ్, కోల్‌కతా; ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. ప్రెసిడెన్సీ కాలేజ్ కోల్‌కతా, గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఢిల్లీలో పనిచేశారు. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ, యుఎన్‌డిపి ప్రాజెక్ట్‌లో చట్టపరమైన సంస్కరణల డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది.