జమ్ముకశ్మీర్‌‌లో ఎన్నికలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏం చెప్పిందంటే..

By Sumanth Kanukula  |  First Published Oct 9, 2023, 4:31 PM IST

కేంద్రపాలిత  ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.


కేంద్రపాలిత  ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు సంబంధించి అడగగా..   ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు.

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమిషన్ ‘‘సరైన సమయం’’గా భావించినప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక, మరో ప్రశ్నకు సమాధానంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఉచితాల ప్రకటనలు ఎల్లప్పుడూ ప్రజాకర్షణ  కలిగి ఉంటాయని చెప్పారు. అయితే ఉచితాలు ఎక్కడ నుండి వస్తాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు.

Latest Videos

ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాంలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత నవంబర్ 7న, రెండో విడత నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న  పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలను డిసెంబర్ 3 ప్రకటించనున్నారు. 

click me!