
Congress president Mallikarjun Kharge: తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం అవసరమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికిగానూ కాంగ్రెస్ శ్రేణులు ఐకమత్యం, సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయడం చాలా ముఖ్యమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
అయిదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన వేళ ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ’ ఢిల్లీలో సమావేశమైంది. ఖర్గే ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం అవసరమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వారి జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం, హక్కులు కల్పించేందుకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ను ఖర్గే మరోసారి వినిపించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఇది కీలకమన్నారు. కానీ, దీనిపై బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చేయడంతోపాటు అందులో ఓబీసీ మహిళలకూ అవకాశం కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. మణిపుర్‌ను విస్మరించి, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచూ పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై అబద్ధపు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు మరింత పెరుగుతాయని, వాటిని దీటుగా ఎదుర్కొవడం చాలా ముఖ్యమని ఖర్గే చెప్పారు.
ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు, అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన చేపడతామని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విభజన వ్యూహాలు, స్వయంప్రతిపత్తి సంస్థలను దుర్వినియోగం చేస్తోందనీ, ఇది ప్రజాస్వామ్య సుస్థిరతకు ముప్పుగా పరిణమించిందని కూడా ఖర్గే విమర్శించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యం, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. దేశ ప్రజలకు అండగా నిలవడంతోపాటు భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లను పరిష్కరించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఇది రెండో సమావేశం. మొదటిది గత నెలలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే.