Kedarnath yatra 2023: నిలిచిన కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు.. ఎందుకంటే?

By Mahesh RajamoniFirst Published Apr 23, 2023, 5:42 PM IST
Highlights

Kedarnath yatra 2023: ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం దృష్ట్యా రిషికేశ్, హరిద్వార్ ల‌లో కేదార్‌నాథ్ యాత్ర కోసం యాత్రికుల రిజిస్ట్రేష‌న్ ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు గర్వాల్ డివిజన్ అదనపు కమిషనర్ (పరిపాలన), చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
 

Char Dham yatra 2023: ప్రస్తుతం కేదార్ నాథ్ లో కురుస్తున్న వర్షాలు, హిమపాతం కారణంగా రిషికేశ్, హరిద్వార్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. "ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం దృష్ట్యా రిషికేశ్, హరిద్వార్ ల‌లో కేదార్నాథ్ యాత్రకు యాత్రికుల నమోదును ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు" గర్వాల్ డివిజన్ అదనపు కమిషనర్ (పరిపాలన), చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం తీర్థయాత్రకు సంబంధించి అడ్వైజరీని జారీ చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలనీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ యాత్రను ప్రారంభించాలని కోరింది. "కేదార్ నాథ్ ధామ్ లో అడపాదడపా వర్షాలు, హిమపాతం కొనసాగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. దేశవిదేశాల నుంచి కేదార్ నాథ్ ధామ్ కు వచ్చే భక్తులందరూ కేదార్ నాథ్ ధామ్ కు వెళ్లే ముందు వాతావరణ సూచనను పరిశీలించాలని కోరుతున్నాం.. అలాగే,  తగినంత వెచ్చని దుస్తులను తీసుకెళ్లాలని" ప్రభుత్వం సూచించింది. శ‌నివారం కేదార్ నాథ్ ధామ్ లో భారీగా మంచు కురిసిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలనీ, వాతావరణ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి తమ యాత్రను ప్రారంభించాలని అభ్యర్థించారు.

కాగా, అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆల‌య ద్వారాల‌ను తెర‌వ‌డంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 27న భక్తుల కోసం తెరవనున్నారు. చార్ ధామ్ యాత్ర కోసం ఇప్పటి వరకు దేశ, విదేశాల నుంచి 16 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. యాత్రికులను పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఆహ్వానించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తి ఏర్పాట్లు చేసిందనీ, యాత్ర సమయంలో భక్తులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు, ఎస్ఓపీలు జారీ చేశారు. ఇందులో ప్రయాణీకులు ప్రయాణ సమయంలో పర్వత వాతావరణానికి తమ శరీరాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇబ్బందులు ఎదురైతే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ప్రయాణం చేయాలన్నారు. యాత్రికుల సంఖ్య, రద్దీ నిర్వహణ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో యాత్రికుల నమోదు కొనసాగుతుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు.

click me!