అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ.. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము..

Published : Jul 25, 2022, 10:21 AM ISTUpdated : Jul 25, 2022, 11:02 AM IST
అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ.. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము..

సారాంశం

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ముతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు.

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ముతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ఓత్ రిజిస్టర్‌పై సంతకం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్ కోవిండ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జాతిని ఉద్దేశించి ఆమె తొలి ప్రసంగం చేశారు. 

అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రపతి పదవికి చేరుకోవడం తన వ్యక్తిగత విజయం కాదని అన్నారు. భారతదేశంలోని ప్రతి పేదవాడి ఘనతని చెప్పారు. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాకుండా ఆ కలలను కూడా నెరవేర్చుకోగలరనడానికి తన నామినేషన్ సాక్ష్యమని తెలిపారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజనులు.. తనను వారి ప్రతిబింబంగా చూడగలరని తనకు సంతృప్తినిస్తుందన్నారు. 

‘‘50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం మొదలైంది. 75 ఏళ్ల సాతంత్ర్య ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందిస్వాతంత్ర్య  భారతదేశంలో పుట్టి.. దేశానికి తొలి రాష్ట్రపతి అయింది నేనే. మన స్వాతంత్ర్య సమరయోధులు, భారత పౌరులు కలిగి ఉన్న అంచనాలను అందుకోవడానికి మన ప్రయత్నాలను వేగవంతం చేయాలి’’ అని ద్రౌపది ముర్ము అన్నారు. 

అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము అన్నారు. జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. కార్గిల్ విజయ్ దివాస్ భారత్ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు, జవాన్లకు శుభాకాంక్షలు చెప్పారు. తాను ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చానని గుర్తుచేశారు. చిన్న గ్రామం నుంచి వచ్చి అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. 

అంతకుముందు ఈ రోజు ఉదయం ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవనానికి చేరుకున్నారు. అక్కడ రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్టులో ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు అక్కడి నుంచి బయలుదేరి పార్లమెంట్‌కు చేరుకున్నారు. 

పార్లమెంట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్‌ కోవింద్‌లను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్‌కు తీసుకువెళ్లారు. ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్న తర్వాత సెంట్రల్ హాల్‌లో జాతీయ గీతం ప్లే చేశారు. 

ఇక, దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి అధిరోహించిన తొలి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రెండో  మహిళగా కూడా నిలవనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?