మహారాష్ట్రలోని ఆ  దేవాలయాల్లో 'డ్రెస్ కోడ్'.. అలాంటి దుస్తులతో నో ఎంట్రీ!

By Rajesh KarampooriFirst Published May 27, 2023, 4:29 AM IST
Highlights

ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాల్లో కోడ్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను కూడా అభ్యర్థించనున్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని నాలుగు ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. శ్రీ గోపాలకృష్ణ దేవాలయం (ధంతోలి), శ్రీ సంకత్మోచన్ పంచముఖి హనుమాన్ దేవాలయం (బెల్లోరి-సవనేర్), శ్రీ బృహస్పతి దేవాలయం (కనోలిబార), శ్రీ హిల్‌టాప్ దుర్గామాత ఆలయం (మానవతనగర్)లలో టీ షర్ట్స్, జీన్స్, స్కర్టులు, అసభ్యకరమైన బట్టలు ధరించి ప్రవేశించకూడదని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఈ డ్రెస్ కోడ్‌ను అమలు చేసే యోచనలో ఉన్నట్లు మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది. నాగ్‌పూర్‌ తర్వాత మహారాష్ట్రలోని అన్ని దేవాలయాల్లో డ్రెస్‌ కోడ్‌ను అమలు చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి అవగాహన కల్పిస్తామని పేర్కొంది. 

ప్రభుత్వ కార్యాలయాలు, అనేక దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు-కళాశాలలు, కోర్టులు, పోలీసు స్టేషనల్లో కూడా డ్రస్ కోడ్ వర్తిస్తుందని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ సునీల్ ఘన్‌వత్ తెలిపారు. దీని ఆధారంగా ఆలయాల పవిత్రత, మర్యాదలు, సంస్కృతి పరిరక్షించబడుతుందనీ, అందుకే ఆలయాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

'పొట్టి బట్టలు వేసుకుని రావద్దు'

నాగ్‌పూర్‌లోని శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో డ్రెస్‌కోడ్ బోర్డు పెట్టిన అనంతరం ఆలయ ధర్మకర్త ప్రసన్న పాటూర్కర్, ఆలయ కమిటీ అధినేత శ్రీమతి మమతాయ్ చించ్వాడ్కర్, అశుతోష్ గోటేలు  విలేకరులతో మాట్లాడారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, భారతీయ సంస్కృతిని పాటించాలన్నారు.

అందుకోసం భక్తులు తమ శరీరాన్ని కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని ఆలయానికి రావద్దని, కేవలం సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతిని అనుసరించి ఆలయ నిర్వహణలో సహకరించాలని కోరారు. మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ సునీల్ ఘన్‌వత్ మాట్లాడుతూ.. ఆలయాల పవిత్రత, మర్యాదలు, సంస్కృతిని కాపాడేందుకు ఇక్కడ డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.  

ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాల్లో కోడ్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను కూడా అభ్యర్థించనున్నట్లు ఆయన తెలిపారు. కొద్ది రోజుల క్రితం, ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయం ఆవరణలో షార్ట్ , బెర్ముడాస్ వంటి "అసభ్యకరమైన" దుస్తులను నిషేధించాలని ప్రయత్నించారు. ఆగ్రహం కలిగించిన కొద్ది గంటల్లోనే ఆర్డర్‌ను ఉపసంహరించుకున్నారు.

click me!