పాకిస్తాన్‌కు సమాచారం లీక్ : డీఆర్‌డీఓ ఫోటోగ్రాఫర్‌కు జీవిత ఖైదు

By Siva KodatiFirst Published Feb 12, 2021, 6:48 PM IST
Highlights

గూఢచర్యం కేసులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కు చెందిన కాంట్రాక్టు ఫోటోగ్రాఫర్‌కు ఒడిశాలోని కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ క్షిపణి పరీక్ష పరిధికి చెందిన సున్నితమైన ఛాయాచిత్రాలను పంచుకున్నట్లుగా ఆరోపణలు రుజువయ్యాయి.

గూఢచర్యం కేసులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కు చెందిన కాంట్రాక్టు ఫోటోగ్రాఫర్‌కు ఒడిశాలోని కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇతను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ క్షిపణి పరీక్ష పరిధికి చెందిన సున్నితమైన ఛాయాచిత్రాలను పంచుకున్నట్లుగా ఆరోపణలు రుజువయ్యాయి.

వివరాల్లోకి వెళితే... ఈశ్వర్ బెహెరా (41) ఒడిశాలోని చండీపూర్ వద్ద డీఆర్‌డీవో క్షిపణి పరీక్షా కేంద్రంలోని సిసిటివి స్టేషన్లో కాంట్రాక్టు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వీడియోలను తీయడానికి ఈశ్వర్.. మిస్సైల్ లాంచింగ్ సైట్ల దగ్గరకు వెళ్లేవాడు. తరువాత తన కెమెరాను రిపేర్ చేయాలనే వంకతో కోల్‌కతాకు బయలుదేరాడు. అయితే, కోల్‌కతాలో దిగిన తర్వాత అతను వీడియోలు ఇతర సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లకు అప్పగించేవాడు. 

బెహేరా ఐఎస్ఐ ఏజెంట్లతో తరచుగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపేవాడని.. అలాగే కనీసం 10 సార్లు వారిని కలిసినట్లు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ పేర్కొంది. అబుదాబి, ముంబై, మీరట్, ఆంధ్రప్రదేశ్, బీహార్‌ల నుంచి ఇతర ప్రదేశాలలో వున్న అతని బ్యాంక్ ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు కూడా కనుగొన్నారు. అతన్ని అరెస్టు చేయడానికి ముందు బెహెరా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) పర్యవేక్షణలో ఉంచారు. 

భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్లు 121 ఎ (గూఢచర్యం) , 120 బి, అధికారిక సీక్రెట్స్ యాక్ట్ (ఓఎస్ఎ) లోని 3, 4, 5 సెక్షన్ల కింద బెహెరాను దోషిగా నిర్ధారించి కోర్టు జీవిత ఖైదు విధించింది. 

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి గిరిజా ప్రసాద్ మహోపాత్రా మాట్లాడుతూ.. బెహరా చర్యలను ఉగ్రవాద చర్యతో పోల్చారు. "ఉగ్రవాద గ్రూపులు ఈశ్వర్ వంటి భారతీయులకు డబ్బును ఎరగా వేసి సమాచారాన్ని సేకరిస్తాయి. భారతీయులలో ఒక సమూహం క్రమం తప్పకుండా శత్రువులకు సమాచారాన్ని సరఫరా చేస్తోంది. దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్న బెహెరా వంటి వ్యక్తులు ఉగ్రవాదులేనన్నారు.

ఇలాంటి వారు భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యల్లో పాల్గొంటారని గిరిజా ప్రసాద్ వ్యాఖ్యానించారు. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే వెళుతున్నారో వారు భారతదేశాన్ని, ప్రజలను ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తారని మహోపాత్రా ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వారికి కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 

click me!