శుభవార్త.. దేశవ్యాప్తంగా లక్ష వైఫై హాట్ స్పాట్లు

First Published Jun 11, 2018, 2:59 PM IST
Highlights

ఇక మొబైల్ డేటాతో పనిలేదు

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇంటర్నెట్ కోసం  మొబైల్ డేటా మీదే ఆధారపడుతున్నారు.  అయితే ఈ మధ్యకాలంలో టెలికం రంగంలో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో టెలికం కంపెనీలన్నీ పోటాపోటీగా GBల కొద్దీ తక్కువ ధరకే అందిస్తున్న నేపథ్యంలో, నెట్వర్క్ కంజెక్షన్ వల్ల చాలా ప్రదేశాల్లో కనీసం సరైన సిగ్నల్ కూడా లభించడం లేదని అందరూ వాపోతున్నారు.

ఈ నేపధ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) దేశవ్యాప్తంగా పదివేల ప్రదేశాల్లో Public WiFi Hotspotలను వచ్చే నెలలో నెలకొల్పబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ టెలికం సెక్రటరీ అరుణ సుందరరాజన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి రాబోయే మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా పబ్లిక్ వైఫై హాట్ స్పాట్లను నెలకొల్పటం లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే మొదటి దశలో వచ్చే నెలలో పదివేలకు పైగా హాట్ స్పాట్లను వివిధ నగరాల్లో స్థాపించనున్నట్లు టెలికం సెక్రటరీ చెప్పారు.

ముఖ్యంగా సరైన మొబైల్ సిగ్నల్స్ లేక నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని టైర్-2, టైర్-3 నగరాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకే అందించే ఉద్దేశంతో ఈ పబ్లిక్ వైఫై హాట్ స్పాట్లను నెలకొల్పుతున్నారు. ఈ హాట్ స్పాట్ లు నెలకొల్పటానికి ఐదు లక్షలకు పైగా వృత్తి నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లవుతుందని సుందర రాజన్ తెలిపారు. చాలా స్వల్ప మొత్తంలో ఒక రూపాయి, మూడురూపాయల విలువ కలిగిన ఇంటర్నెట్ ప్యాక్‌లు ఈ వైఫై హాట్ స్పాట్ ల ద్వారా లభించబోతున్నాయి.

మరోవైపు ప్రైవేట్ ఆపరేటర్లు అయిన రిలయన్స్, జియో, ఎయిర్ టెల్  వంటివి కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో వైఫై హాట్ స్పాట్ లను నెలకొల్పుతున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఇకపై మొబైల్ సిగ్నల్ గురించి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఒక చోట స్థిరంగా ఉండకుండా కదులుతూ ఉండే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రమే మొబైల్ డేటా అవసరం పడుతుంది. ఒక చోట స్థిరంగా ఉండే సందర్భాల్లో దగ్గర్లో public wi-fi hotspot లభించినట్లయితే దానికి కనెక్ట్ అయితే సరిపోతుంది.

click me!