
న్యూఢిల్లీ: పురిట్లోనే తల్లిని పోగొట్టున్న పిల్లలు రొమ్ము పాలకు దూరమవుతారు. అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లి పాల లోటు రాకుండా మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నది. ఆ రాష్ట్రంలో తొలిసారిగా తల్లి పాల బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నది. ఈ బ్యాంక్ ద్వారా తల్లికి దూరమైన నవజాత శిశువులకు తల్లి పాల లోటును తీర్చి న్యూట్రిషనల్ ఎలిమెంట్స్‌ను అందించడం వీలవుతుందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ పాత్రికేయులతో చెప్పారు.
ఈ స్కీమ్ కింద బాలింతలు తమ రొమ్ము పాలను మదర్ మిల్క్ బ్యాంక్‌కు విరాళం ఇవ్వవచ్చు అని వివరించారు.
హిమాలయ సానువుల్లోని పది రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ మూడో స్థానంలో ఉన్నది. నేషనల్ హెల్త్ మిషన్స్ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు 2021 ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రతి వేయి మంది పిల్లల్లో 27 మంది మరణిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ తర్వాత ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక శిశు మరణాలు ఉన్నాయి.
శిశు మరణాల రేటును తగ్గించడానికి తమ ప్రభుత్వం.. హాస్పిటళ్లలో ప్రసవాలకు ప్రాధాన్యత ప్రోత్సహిస్తున్నట్టు ఆరోగ్య మంత్రి తెలిపారు. గర్భిణులను ఉచితంగా హాస్పిటల్ తీసుకెళ్లడం, తల్లికి పౌష్టికాహారం కోసం రూ. 2,000, రూ. 1,500లు అందిస్తున్నది. పురుడు కార్యక్రమానికి రూ. 500 అందిస్తున్నది. రాష్ట్రంలో సర్జన్‌ల కొరతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నది.