
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ సైనికుడిని దారుణంగా కొట్టి చంపారు. నిందితులను స్థానిక డీఎంకే నాయకులు, వారి బంధువులుగా గుర్తించారు. హత్యకు గురైన సైనికుడు ప్రభు భార్య పునీతా ప్రభు తనకు న్యాయం చేయాలంటూ అప్పుడే పుట్టిన ఇద్దరు కూతుళ్లను చేతుల్లో పెట్టుకుని వేడుకోవడం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ దారుణ హత్య నేపథ్యంలో సైనికుడి కుటుంబాన్ని అధికార పార్టీకి చెందిన నేతలెవ్వరూ పరామర్శించలేదు.
సైనికుడి భార్య మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వచ్చి తనను కలవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఖండించింది. సైనికుడిని శత్రువులు చంపలేదని, డీఎంకే గూండాలు చంపారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రభుని చంపిన వ్యక్తిని కృష్ణగిరి జిల్లాకు చెందిన డీఎంకే కౌన్సిలర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
అసలేం జరిగిందంటే:
కృష్ణగిరికి చెందిన ప్రభాకరన్ అతని సోదరుడు ప్రభు సైన్యంలో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చిన్నస్వామి నాగరసంబట్టి మున్సిపాలిటీలోని 1వ వార్డ్ డీఎంకే కౌన్సిలర్. ఈ క్రమంలో చిన్నస్వామి, ప్రభాకరన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ తారాస్థాయికి చేరడంతో చిన్న స్వామి తన కుమారులు గురు సూర్యమూర్తి, గుణనిధి, రాజపాండియన్ తదితరులతో కలిసి ప్రభాకరన్, అతని సోదరుడు ప్రభు వీరి తండ్రిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభు భార్య పునీతా.. తన ఇద్దరు కుమార్తెలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పటి వరకు అధికార పార్టీకి చెందిన వారెవ్వరూ ఈ విషయంలో స్పందించలేదు. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా వచ్చి తనను కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఘటనను ఖండించడంతో పాటు జవాన్ ప్రభు కుటుంబానికి బాసటగా నిలిచారు.