
న్యూఢిల్లీ: ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ సోమవారంనాడు రాత్రి భేటీ అయ్యారు. ఇవాళ డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ కడుపునొప్పి కారణంగా డీకే శివకుమార్ న్యూఢిల్లీకి వెళ్లలేదు. కానీ డీకే సురేష్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటక సీఎంగా తన సోదరుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపడితే పార్టీ క్యాడర్ సంతోషిస్తుందని డీకే సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఢిల్లీకి చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య పార్టీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు.
ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే విషయమై ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంపిన పరిశీలకులు తీసుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకుల బృందం కాంగ్రెస్ అధిష్టానానికి అందించనుంది.
also read:ఫామ్‌హౌస్ నుండి ఇంటికి: మద్దతుదారులతో డీకే శివకుమార్ భేటీ
ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య పార్టీ అగ్రనేతలతో సమావేశాలు నిర్వహించారు. కర్ణాటక సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తాను కీలక పాత్ర పోషించినట్టుగా డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు. మల్లికార్జునఖర్గేతో డీకే సురేష్ ఏం మాట్లాడారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రేపు ఉదయం డీకే శివకుమార్ ఢీల్లికి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.