
కర్ణాటకలో బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చీరాగానే కాంగ్రెస్ పై పడబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇస్తామని, ఇదే వారి హనీమూన్ సమయం అని జేడీఎస్ గతంలోనే పేర్కొంది. తాజాగా, ఇందుకు సంబంధించి మరోసారి కర్ణాటక విధాన పరిషత్‌లో చర్చకు వచ్చింది.
ఈ అంశం ప్రస్తావనకు రాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నవ్వులు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు కామెడీ పంచ్‌లు వేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయిందని, ఇక కాంగ్రెస్ హనీమూన్ సమయం ముగిసిందని జేడీఎస్ నేత శరవణ అన్నారు. దీనికి వెంటనే హోం మంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ.. అయ్యో.. ఇదేంటీ? హనీమూన్ కనీసం ఆరు నెలలైనా కావాలని పేర్కొన్నారు. దీంతో నవ్వులు విరిశాయి. అలాగా!.. ఐతే ఓకే తీసుకోండి అంటూ శరవణ సమాధానం ఇచ్చారు.
ఇది చూస్తున్న బీజేపీ సభ్యుడు డీఎస్ అరుణ్ లేచి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొత్తవారికి హనీమూన్ అవసరం ఉంటుందని, కానీ, కాంగ్రెస్‌కు చెందిన నేతలు 70 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటున్నవారే అని పేర్కొన్నారు. కాబట్టి, వారికి ఇప్పుడు ప్రత్యేకంగా హనీమూన్ లాంటిదేమీ ఉండదని చమత్కరించారు. కాంగ్రెస్‌లో ఎక్కువ మంది నేతలు వృద్ధులు అన్నట్టుగానూ ఆయన మాటలు ధ్వనించాయి.
Also Read: తమిళనాడు బీజేపీలో మార్పులు.. నిర్మల సీతారామన్‌కు కీలక బాధ్యతలు?
సిద్ధరామయ్య పది కేజీల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారని, కేంద్రం ఇచ్చే ఐదు కేజీలు కలిపి మొత్తం 15 కిలోల బియ్యం ఇవ్వాలని శరవణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అన్నభాగ్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేసింది మాత్రం మాజీ సీఎం దేవేగౌడనే అని పేర్కొన్నారు. ఈ మాటలను కాంగ్రెస్ నిరాకరించింది. అన్నభాగ్యను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చింది సిద్ధరామయ్యనే అని, శరవణ మాటలు సభకు తప్పుడు సందేశం ఇచ్చేలా ఉన్నాయని మంత్రి జమీర్ అహ్మద్ తెలిపారు. గతంలోనూ బియ్యం ఇచ్చారనీ, ఇక పైనా సిద్ధరామయ్య ఇస్తారని వివరించారు. చర్చ గంభీరంగా మారుతుండటం చూసి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే జోక్యం చేసుకున్నారు. శరవణ బంగారం స్పెషలిస్టు అయితే.. సిద్ధరామయ్య అన్నభాగ్య స్పెషలిస్టు అని వాతావరణాన్ని తేలికపరిచారు.