కేరళలో శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో ఓ అపూర్వదృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. కోజికోడ్‌లో జరిగిన శోభా యాత్రలో కృష్ణుడి వేషధారణలో ఉన్న ఓ వికలాంగ ముస్లిం బాలుడు అందరినీ ఆకర్షించాడు.
కోజికోడ్ : కేరళలో బుధవారం శ్రీకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. బాలగోకులం జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న వందలాది మంది చిన్నారుల్లో ముహమ్మద్ యాహియాన్ (8) అనే ముస్లిం చిన్నారి శ్రీకృష్ణుడి వేషధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వీల్ చైర్‌లో ఉన్న యాహియాన్ తన దగ్గరికి వచ్చిన మీడియా వారితో మాట్లాడుతూ... శ్రీకృష్ణుడిలా రెడీ అవ్వడం తనకు చాలా ఇష్టం అని.. తన తల్లి కూడా తన ఇష్టాన్ని కాదనదని చెప్పాడు. మొత్తం చిన్నికృష్ణులు, గోపికలతో నిండిఉన్న ఆ శోభాయాత్రలో ముహమ్మద్ యాహియాన్ తల్లి కొడుకుకు తోడుగా నడిచింది. రూబియా పర్దా అనే ఆ మహిళ తమ మతాచారాలప్రకారం పర్దా వేసుకుని కొడుకుతో పాటు వచ్చింది.
పసుపు రంగు పట్టు దుస్తులు, నుదుటన తిలకం, బంగారు కిరీటం, నెమలి పింఛం ధరించి యహియాన్ శోభా యాత్రలో పాల్గొన్నాడు. అతను మాట్లాడుతూ.. ‘వర్షం పడింది. అయినా కూడా నేను కృష్ణుడిలా రెడీ అవ్వాలనుకున్నాను. కాబట్టి దాన్ని నేను పట్టించుకోలేదు" అని ఆ చిన్నారి సంతోషంగా చెప్పాడు.
శోభాయాత్రకు ఇరువైపులా ఉన్న జనాలు చేతులు ఊపుతూ, సంతోషంతో మునిగితేలాడా చిన్నారి. తన తల్లే తనను అలా అలంకరించిందని అందరికీ చెప్పాడు. యాహియాన్‌కు శారీరక వైకల్యాల కారణంగా వీల్‌చైర్ లేనిదే తిరగలేడు. శోభాయాత్ర గురించి.. అతని తల్లి రూబియా మాట్లాడుతూ... శ్రీకృష్ణునిలా రెడీ అవ్వాలని.. ఊరేగింపులో పాల్గొనాలనే తమ కొడుకు కోరికను నెరవేర్చడానికే ఇలా చేసినట్లు తెలిపింది.
"పాపులారిటీ కోసం ఇది చేయలేదు, మా అబ్బాయి ఆనందం కోసం చేసాం, మొదటిసారి ఇలాంటి ఊరేగింపులో పాల్గొంటున్నాం" అని రూబియా చెప్పుకొచ్చింది. తాను పెద్దయ్యాక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నానని యాహియాన్ తెలిపాడు. చిన్నారి ప్రస్తుతం నడవలేడు. అయితే అతనికి కండరాలకు చికిత్స అందిస్తున్నారని, యాహియాన్ త్వరలో నడుస్తారని వైద్యులు హామీ ఇచ్చారు. యాహియాన్ బిలాతికులం బిఈఎమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు.