కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్.. సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు..!

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 5:02 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా  మార్చింది. తాజాగా అందుతున్న సమాచారం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ రెడీ అయ్యారు. 

రాజస్తాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా  మార్చింది. రాజస్తాన్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశ థరూర్.. పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఇక, ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం కేరళలో ఉన్న దిగ్విజయ్ సింగ్.. ఈ రాత్రికే దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం ఆయన సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి పలు సందర్భాల్లో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. తాను పోటీ చేయడం లేదని మాత్రం చెప్పలేదు. చూద్దాం.. పోటీకి తనను ఎందుకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారనే కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. ‘‘నేను ఎవరితోనూ ఈ విషయం చర్చించలేదు. నేను హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోలేదు. నేను పోటీ చేస్తానో లేదో అది నాకే వదిలేయండి. హైకమాండ్ నన్ను కోరితే నామినేషన్ దాఖలు చేస్తాను’’ అని అన్నారు. 

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూడడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా  కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదన్న నిర్ణయానికి రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. రాహుల్‌ను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలపాలని పలువురు సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.  

శశి థరూర్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23 నేతల్లో ఆయన కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన గాంధీ కుటుంబం మద్దతు ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇక, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30ని చివరి తేదీ. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 చివరి తేదీ. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే.. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 19న ఫలితాన్ని ప్రకటించనున్నారు. 
 

click me!